
Phalana Abbayi Phalana Ammayi: నాగ శౌర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా లక్ తగలడం లేదు. దీంతో తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో జతకట్టాడు. వీరి కాంబోలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు టీజర్ విడుదల చేశారు.
శ్రీనివాస్ అవసరాల మార్క్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ ఉంది. సంజయ్-అనుపమ మధ్య ఏర్పడే స్నేహం, ప్రేమ, గొడవలు, విబేధాలు, విడిపోవడాలు వంటి అంశాలతో ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. సంజయ్ గా నాగ శౌర్య, అనుపమగా మాళవిక నాయర్ నటించారు. గతంలో వీరిద్దరూ కళ్యాణ వైభోగమే టైటిల్ తో ఓ చిత్రం చేశారు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ ఆ చిత్రాన్ని మరోసారి గుర్తు చేసింది. హీరో హీరోయిన్ కూడా సేమ్ కావడంతో దానికి సీక్వెల్ లా అనిపించింది.

శ్రీనివాస్ అవసరాల ఓ కీలక రోల్ చేశారు. గతంలో నాగ శౌర్య హీరోగా ఆయన ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద చిత్రాలు తెరకెక్కించారు. ఊహలు గుసగుసలాడే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చాలా ఏళ్ళ తర్వాత ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అంటూ నాగ శౌర్యతో మూవీ చేశాడు. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
కాగా గత ఏడాది నాగ శౌర్య వివాహం చేసుకున్నారు. బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో తాళి కట్టాడు. వివాహం అనంతరం విడుదలవుతున్న మొదటి చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. మరి పెళ్లితో అయినా నాగ శౌర్య లక్ మారుతుందేమో చూడాలి. ఛలో నాగ శౌర్య కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉంది. ఆ రేంజ్ హిట్ మరలా ఆయనకు పడలేదు.
