
KCR: కాంగ్రెస్‌లో మాస్ లీడర్‌గా గుర్తింపు ఉన్న నేత జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్ గాలి బలంగా వీస్తున్నా.. సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. ముక్కుసూటితనం ఎక్కువగా ఉండే జగ్గారెడ్డి తన మాటలు, చేస్టలతో నిత్యం వివాదాల్లో ఉంటారు. సొంతపార్టీ నేతలపై విమర్శలు చేయడం, అధికార పార్టీ నేతలతో భేటీలు కావడం జగ్గారెడ్డికి కామన్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ కేసీఆర్ కోవర్టుగా జగ్గారెడ్డికి ముద్ర ఉంది.
సీఎంతో భేటీ…
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఒకసారి గొడవ పడుతారు.. ఇంకోసారి ఇద్దరం కలిసిసోయామని మీడియా ముఖంగా ప్రకటిస్తారు.. మళ్లీ కొన్ని రోజులకే రేవంత్ తనను తొక్కాలని చూస్తున్నాడని ఆరోపిస్తారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అని ప్రకటిస్తారు. ఇలా సొంతపార్టీ అధ్యక్షుడిపై అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి గతంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను కలిసి వివాదాస్పదమయ్యాడు. తాజాగా అసెంబ్లీ హాల్‌లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సమావేశం కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ యాత్రలో పాల్గొనడానికి సీనియర్లెవరూ వెళ్లడం లేదు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సీఎంను కలవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇప్పటికే.. అటు రాష్ట్రంలో.. ఇటు పార్టీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సమయంలోనే.. కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఈ భేటీపై వస్తున్న ఆరోపణలపై జగ్గారెడ్డి మాత్రం మరోలా స్పందిస్తున్నారు. కలిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి?
సీఎం కేసీఆర్‌తో భేటీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే అని జగ్గారెడ్డి చెబుతున్నారు. వాళ్లు కలిస్తే తప్పులేదు.. నేను కలిస్తేనే తప్పా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్ మీద చేసిన వ్యాఖ్యలు సర్వత్రా దుమారం రేపుతుండగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇది ఇప్పుడు అటు కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే.. తాను కేసీఆర్‌ను కలిసింది నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల గురించేనని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మెట్రో లైన్ పొడిగింపు అంశంపై సీఎంకు వినతిపత్రం ఇచ్చానని తెలిపారు.
వాళ్లు కలిస్తే తప్పులేదు.. నేను కలిస్తే తప్పా?
ఈ భేటీపై జగ్గారెడ్జి వివరణ మాత్రం ఇంకోలా ఉంది. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మంత్రి మోదీని కలిస్తే తప్పులేదు కానీ.. తాను ఓ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే.. తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేసిన రెండు రోజులకే తనపై కోవర్టు ముద్రేశారని.. ఇక కొత్తగా వచ్చే బదనాం ఏముందంటూ తమపై వచ్చే ఆరోపణలను కొట్టిపారేశారు జగ్గారెడ్డి. అంతేకాదు.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తే.. ప్రగతి భవన్‌కు కూడా వెళ్లి కలుస్తానని మరో బాంబు పేల్చారు జగ్గారెడ్డి.
కేసీఆర్ అందుకే అపాయింట్‌మెంట్ ఇచ్చారా..
ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చింది. రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తెలంగాణలో ఓ సర్వేలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 22 శాతం, బీజేపీకి 19 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను మళ్లీ దెబ్బతీయాలని కేసీఆర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల వ్యవహారం మరీ ఆసక్తికరంగా మారింది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నేతలతో భేటీ అవుతారో.. ఎవరు ఎవరిని విమర్శిస్తారో అన్నది ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ అంశమే. కాంగ్రెస్ బలహీనపర్చే కార్యంలో భాగంగానే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జగ్గారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. తద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిలకడ ఉండదన్న సంకేతాన్ని తెలంగాణ ప్రజల్లోకి పంపాలని చూస్తున్నారు.

మొత్తంగా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ పన్నిన ట్రాప్‌లో జగ్గారెడ్డి ఈజీగా పడ్డారన్న చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.