Vangaveeti Ranga- Pawan Kalyan: వంగవీటి…ఈ మాట వింటేనే ఒక వైబ్రేషన్. ఏపీ పాలిటిక్స్ లో ఒకరకమైన షేక్. మోహన్ రంగా చనిపోయి మూడున్నర దశాబ్దాలు దాటుతున్నా. ఆయన పేరు సజీవం. నేటి తరానికి తెలియకున్నా ఆయన ఆశయాలు తెలుసుకోవాలన్న ఆరాటం వంగవీటి క్యారెక్టర్ ను తెలియజేస్తోంది. ప్రజల మధ్య పుట్టి ప్రజలతో మమేకమైన మాస్ లీడర్ ఆయన. కష్టంలో ఉన్నాను అని ఎవరైనా సహాయం కోరితే కులం, మతం, ప్రాంతం అని చూడకుండా సాయం చేసే గొప్ప మనసు వంగవీటిది. అదే ఆయనకు ఒక స్థాయిని, ఖ్యాతిని తెచ్చిపెట్టింది. రాజకీయంగా పదవులు చేపట్టింది స్వల్పకాలమే అయినా.. ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ నే శాసించిన లీడర్ వంగవీటి. చనిపోయి 36 సంవత్సరాలవుతున్నా ఆయన పేరు ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఆయన పేరు వినిపిస్తోంది. తమవాడిగా చూసుకునేందుకు రాజకీయ పార్టీలు పరితపిస్తాయి. ఆ పేరుతోనే ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తాయి.

కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి విజయవాడలో దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రజా సమస్యలపై తన ఇంటి ముందే నిరసన దీక్ష చేపడుతున్న వంగవీటిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. బాంబులు వేసి.. వేట కొడవళ్లతో నరికి చంపారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో కమ్మ సామాజికవర్గీయుల ఇళ్లపై దాడులు జరిగాయి. దాదాపు 45 రోజుల పాటు విజయవాడ కర్ఫ్యూ, నిఘా నీడలోకి వెళ్లిపోయింది. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే ఇరు కుటుంబాల్లో హత్యలు జరిగాయని విజయవాడ వాసులు ఇప్పటికీ చెబుతుంటారు. వంగవీటి కుటుంబంలో రాధా, మోహన్ రంగా, దేవినేని ఫ్యామిలీలో గాంధీ, మురళీలు హత్యకు గురయ్యారు. ఇరు వర్గాలకు చెందిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రంగా హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో మాత్రం టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది. అది రంగా హత్య ఎఫెక్టే కారణమని ప్రచారం జరిగింది. అది జరిగింది మొదలు వంగవీటి మోహన్ రంగా ప్రభావం ప్రతీ ఎన్నికల్లో చూపుతోంది.
వంగవీటి మోహన్ రంగా హత్య జరిగి 36 ఏళ్లు అవుతోంది. దాదాపు 5 ఎన్నికలు వచ్చాయి. ప్రతీ ఎన్నికలోనూ అన్ని రాజకీయ పార్టీలు వంగవీటి రంగాను తెరపైకి తెస్తున్నాయి. పాత తరానికే తెలిసే రంగా ఇంతలా ప్రభావం చూపడానికి చాలా కారణాలున్నాయి. ఆయన్ను కాపు నాయకుడిగా చూపించడంలో రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. అటు కాపులు కూడా రంగాలోనే తమ నాయకుడ్ని చూసుకున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 600 విగ్రహాలను స్వచ్ఛందంగా ఏర్పాటుచేశారు. అయితే రంగా తరువాత ఆ స్థాయి నాయకుడు కాపులకు అండగా దొరకలేదు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ ఆ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ప్రజారాజ్యంతో చిరంజీవి ఎంట్రీ ఇచ్చినా ఆయన సక్సెస్ కాలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కాపులకు ఒక ఆల్ట్రనేషన్ కనిపించింది. కాపులంతా ఇప్పుడు సంఘటితమవుతున్నారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాను స్ఫూర్తిగా తీసుకొని కాపులంతా ఒక వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకూ వంగా వర్ధంతి, జయంతిలను అసోసియేషన్లు సాదాసీదాగా నిర్వహించేవి. అటు వంగా వారసుడు రాధా సైతం తన ఇంటి ముందు ఉండే రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేవారు. సేవా కార్యక్రమాలకు పరిమితమయ్యేవారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. అటువంటి రంగా,రాధా రాయల్ ఆసోసియేషన్ ఫస్ట్ టైమ్ భారీగా ప్లాన్ చేసింది. ఈ నెల 26న విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లీడ్ తీసుకున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ స్కెచ్ గా అభివర్ణిస్తున్నారు. పవన్ కు కాపుల మద్దతు కూడగట్టేందుకేనన్న టాక్ నడుస్తోంది.

అయితే అటు అధికార వైసీపీలో సైతం కలవరం ప్రారంభమైంది.అందుకే ఎదురుదాడికి సిద్ధమైంది. రంగా హత్య ఉదాంతాన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నాడు టీడీపీ గుండాలే రంగాను హత్య చేశారని ఆరోపించారు. అయితే ఉదయభాను పక్కనే రంగా కుమారుడు రాధా ఉన్నారు. కానీ ఆయన పెద్దగా రియాక్టు కాలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీని ఆత్మరక్షణలో పడేసేందుకే ఉదయభాను ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రంగా హత్య తరువాత ఆయన ప్రత్యర్థి దేవినేని నెహ్రూను రాజకీయంగా ఎన్టీఆర్, తరువాత వైఎస్, చంద్రబాబు చేరదీశారు. ఇప్పుడు నెహ్రూ కుమారుడు అవినాశ్ వైసీపీలో ఉన్నారు. అటు రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీలోకి వంగవీటి కుమారుడు వెళ్లారు. ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో రంగా క్రెడిబులిటీని క్యాష్ చేసుకోవడమే తప్ప మరొకటి కాదు అన్న విశ్లేషణలున్నాయి. అయితే మరోసారి మిగతా రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా.. పవన్ వైపే కాపులందరూ మొగ్గుచూపేలా ఒక మెసేజ్ పంపించేందుకే విశాఖలో కాపునాడు సభ అన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి కాపులకు రాజ్యాధికారం దక్కాలని.. అదే రంగా అభిమతమని.. సీఎంగా పవన్ కళ్యాణ్ ను ఎస్టాబ్లిస్ చేయాలన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా టాక్ నడుస్తోంది. అయితే ఈ నెల 26తో దీనిపై క్లారిటీ రానుంది.
