Pawan Kalyan Yuvashakti Sabha: యువతరమే దేశ భవిష్యత్తు. యువశక్తితో అద్భుతాలు సృష్టించగలం. యువత భాగస్వామ్యం లేనిదే అభివృద్ది సాధించలేం. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి గల దేశం మనది. కానీ పాలకులు దేశాభివృద్ధిలో యువశక్తి భాగస్వామ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. యువతను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు. యువతకు సరైన వనరులు కల్పిస్తే ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలపగల శక్తియుక్తి ఉంది.

పాలకులకు ఎన్నికలప్పుడే యువత గుర్తొస్తుంది. యువత భవిష్యత్ గురించి, వారి ఆశలు, ఆకాంక్షల గురించిన బాధ పాలకులకు ఏ కోశానా లేదు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ యువశక్తిని గుర్తించారు. దేశనిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నారు. యువతను ఓటు బ్యాంకుగా కాకుండా సామాజిక మార్పుకు దోహదపడే చోదకశక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువత ఆశలు, ఆకాంక్షలను ప్రపంచానికి చాటే అవకాశాన్ని యువతరానికి కల్పిస్తున్నారు. ఇంత వరకు ఏ నాయకుడూ చేయని కార్యాన్ని పవన్ భుజానికెత్తుకున్నారు.
మిగిలిన నాయకులకు భిన్నంగా పవన్ ఆలోచిస్తున్నారు. యువ భాగస్వామ్యాన్ని రాజకీయాల్లో, పాలనలో పెంచాలని ఆశిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. యువతను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రణస్థలంలో వంద మంది యువకులకు ప్రసంగించే అవకాశం ఇచ్చారు. ఇదివరకెప్పుడూ , ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని వినూత్న కార్యక్రమాన్ని పవన్ చేపట్టారు.

పాలకులు యువతరాన్ని పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకపోవడానికి ప్రశ్నిస్తారనే భయమే. ఆ భయంతోనే యువతను కాంపిటీటివ్ పరీక్షలు, కెరీర్ పేరుతో అభివృద్ధి గురించి ఆలోచించే తీరిక లేకుండా చేస్తున్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే యువమంత్రం పఠిస్తారు. కులాలు, మతాల పేరుతో యువశక్తిని నిర్వీర్యం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రశ్నించే శక్తులను అణిచివేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు అంత మంచిది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. యువతను అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాలని సూచిస్తున్నారు.