Pawan Kalyan: బీజేపీ రోడ్ మ్యాప్ ప్రకటించిన తర్వాత పవన్ వేస్తున్న అడుగులు ఆ పార్టీలో గుబులు రేపుతున్నాయి. నరేంద్రమోదీతో భేటీ తర్వాత చంద్రబాబుతో కలవడం కొంత కలవరానికి గురిచేస్తోంది. బీజేపీతో మిత్రబంధం కొనసాగిస్తూనే చంద్రబాబుతో కలవడం బీజేపీకి మింగుడు పడటం లేదు. పవన్ అనూహ్యంగా వేసిన అడుగులు బీజేపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి.

వైసీపీ పై పోరాటానికి పవన్ కళ్యాణ్ బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ కాస్త లేటుగా అయినా టీడీపీ ప్రస్తావన లేని రోడ్ మ్యాప్ ప్రకటించింది. బీజేపీతో కలిసి వెళ్తున్నట్టు ఆశీర్వదించాలని పవన్ ప్రజలను కోరారు. అయితే ప్రభుత్వం పై పోరాటానికి ప్రతిపక్షాలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటం జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రతిపక్షాల ఓటు చీలనివ్వనని ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ మొదలైంది.
పవన్ ప్రకటనతో బీజేపీ ఖంగుతింది. పవన్ వ్యూహం అర్థంకాక మల్లగుల్లాలు పడింది. మోదీతో భేటీ తర్వాత కూడ చంద్రబాబుతో కలిసి వెళ్తామనే ప్రకటన చేయడం బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను అన్న చోటే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చెప్పుకోవాలి. బీజేపీను కూడ తమతో కలిసి రావాలని పరోక్షంగా పవన్ ఆహ్వానించారు. అధికార పార్టీ చంద్రబాబు, పవన్ ల కలయికను తీవ్రంగా విమర్శిస్తోంది. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి ఇబ్బంది అవుతుంది.. కనుక వైసీపీ సహజంగానే విమర్శిస్తుంది. వైసీపీ ట్రాప్ లో పడి చంద్రబాబుకు దూరంగా ఉండకుండా ప్రతిపక్షాల ఐక్యతను పవన్ కోరుకున్నారు. దీంతో బీజేపీ, వైసీపీకి ఒక్కసారిగా నోట్లో వెలగపండు పడ్డట్టు అయింది.

టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసి రావాలని ఆ రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. అయితే బీజేపీ జనసేనతో కలిసేందుకు సిద్దంగా ఉంది కానీ టీడీపీతో కలవడానికి సుముఖంగా లేదు. టీడీపీ, జనసేన కలిసి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనే ప్రశ్న మొదలైంది. జగన్ పట్ల సానుకూల వైఖరితో వెళ్తుందా ? లేదా ? అన్న అంశం ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. బీజేపీ వైఖరిని బట్టే పవన్ స్పందన ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ పవన్ బీజేపీకి వ్యతిరేకమైతే ఏపీలో బీజేపీకి ఖచ్చితంగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతటి వారినైనా ఎదిరిస్తాడనే పేరు ఇప్పటికే పవన్ కు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో వేచిచూడాల్సిన అవసరం ఉంది.