Pawan Kalyan- Sajjala Ramakrishna Reddy: ఏపీలో పాలిస్తోంది సీఎం జగన్ కాదు.. నడిపిస్తున్నది ముమ్మాటికీ జగన్ కాదు. తెరవెనుక ఉండి తతంగం నడిపిస్తున్న డిఫెక్టో సీఎం ఒకరున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ వ్యాఖ్యలు ఏపీ పొలిటిక్స్ లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పటం గ్రామంలో ఇళ్ల ధ్వంసం వెనుక సజ్జల రామక్రిష్ణారెడ్డి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ ఆయనపై ఫైర్ అయ్యారు. గతంలో సజ్జల రామక్రిష్ణారెడ్డిని పవన్ గౌరవభావంతో చూసిన సందర్భాలున్నాయి. ఆయన విషయంలో అచీతూచీ వ్యవహరించారు. కానీ ఇప్పటం గ్రామంలో అక్రమంగా 39 మంది ఇళ్లను కూల్చివేసిన ఘటన వెనుక సజ్జల పాత్ర ఉందని తెలియడంతో పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో డిఫెక్టో సీఎంగా అభివర్ణించారు. ఆయన వ్యవహార శైలిపై రియాక్ట్ అయ్యారు.

ఇప్పటం ఇళ్ల బాధితులకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రూ.లక్ష చొప్పున.. 39 మందికి రూ.39 లక్షలు అందించారు. ఈ సందర్భంగా సాగిన పవన్ ప్రసంగం ఎక్కువగా సజ్జలనుద్దేశించే సాగింది. రాష్ట్రంలో విధ్వంసాల వెనుక సజ్జల పాత్ర, ప్రోత్సాహం ఉందని పవన్ ఆరోపించారు. ‘ఇప్పటంలో ఇళ్ల తొలగింపు వెనుక సజ్జల ప్లాన్ ఉందని తెలిసింది. గతంలో నేను ఆయనది ఆధిపత్య ధోరణి అంటే బాధపడ్డారు. కానీ ఇప్పుడు చెబుతున్నా..ఆధిపత్య ధోరణి అంటే అహంకారం అని అర్థం. మీరేమైనా పెట్టి పుట్టారా? మిగతావారు బానిసలా? మీ ముందు ఎవరూ నోరు తెరిచి మాట్లాడకూడదనుకుంటారా సజ్జలా? రేపటి నుంచి నన్ను తిట్టుకోండి.. దాడులు చేసుకోండి..మీ ఉడత ఊపులకు జనసేన భయపడదు…పవన్ కళ్యాణ్ భయపడడు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజల్లో ఒకర్ని ఇబ్బందిపెట్టినా సహించేది లేదు…2024లో మా ప్రభుత్వం వచ్చాక.. మీ లీగల్ విధానంలోనే బదులిస్తాం..అధికారంలో లేనివాడిని.. అరవడం తప్ప ఏమీ చేయలేనని అనుకుంటున్నారు ఏమో.. మాది రౌడీసేన అంటున్నారు.. ఆ పెద్ద మనిషికి చెప్పండి.. మాది రౌడిసేన కాదు విప్లవసేన అని..పిచ్చి వేషాలు వేస్తూ హత్యా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. వైసీపీ పార్టీయా.. టెర్రిరిస్టు ఆర్గనైజేషనా? ఉగ్రవాద సంస్థా? సజ్జలలాంటి వ్యక్తులు హత్యా రాజకీయాలు చేయలేమో అంటారు.. ప్రభుత్వానికి మీరేచ్చే సలహా ఇదా సజ్జలా?’ అంటూ పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అయితే ఇప్పుడు పవన్ లేటెస్ట్ కామెంట్స్ ఏపీలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అటు పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల పాత్ర పెరిగింది. కేవలం సలహదారుడిగానే కాకుండా పాలనలోనూ పార్టీలోనూ సజ్జల పెత్తనం పెరిగిపోయింది. కేబినెట్ సబ్ కమిటీల్లోనూ ఆయనే.ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చల్లోనూ ఆయనే. సీనియర్ మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు ఉన్నా.. సీఎం జగన్ సజ్జలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అటు పార్టీలో కూడా యాక్టివ్ రోల్ ను సజ్జల ప్లే చేస్తున్నారు. కుమారుడుకి వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు అప్పగించారు. ఎటువంటి పదవులు లేకున్నా సలహదారుడిగా జగన్ తరువాత ‘పవర్’ తన చేతిలో ఉంచుకున్నారు. రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా దాని వెనుక సజ్జల పాత్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటం విషయంలో కక్ష కట్టి సజ్జల వెంటాడారన్న అపవాదును మూటగట్టుకున్నారు. సున్నితమైన విషయాన్ని సజ్జలే జఠిలం చేశారన్న టాక్ అయితే ఉంది. కేవలం జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భూములిచ్చారన్న కారణం చూపి కత్తి కట్టి మరీ రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లు తొలగించారు. పవన్ పరామర్శ తరువాత విమర్శలు రావడంతో ధ్వంసం చేసిన ఇళ్ల ముందే ‘తమ ఇళ్లను ప్రభుత్వం ధ్వంసం చేయలేదు.. అనవసరంగా రాజకీయం చేయొద్దు..మాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. మీ పరామర్శలు మాకు అవసరం లేదు’ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టించారు. విద్యుత్, రేషన్ వంటి పౌరసేవలు నిలిపివేసి బాధితులపై ఒత్తిడి పెంచారు. చివరకు జనసేన ప్రకటించిన లక్ష రూపాయల సాయం అందుకోవద్దని కూడా ఒత్తిడి తెచ్చారు. వీటన్నింటి వెనుక సజ్జల పాత్ర ఉందని జనసేనకు పక్కా సమాచారం ఉంది. అందుకే పవన్ అంతలా రియాక్టయ్యారు. సజ్జలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే పవన్ తాజా కామెంట్స్ తో ఏపీని పాలిస్తున్నది జగన్ కదా? సజ్జల అంటూ సోషల్ మీడియాలో షటైర్లు ప్రారంభమయ్యాయి,