
Pawan Kalyan – BJP: పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. కేంద్రంలో బీజేపీతో కలిసి ఉన్నామని ఆయన చెబుతున్నా, అమీతుమీ తేల్చుకోవడానికే ఆయన ఢిల్లీకి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే వారాహి యాత్ర పవన్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ యాత్రకు బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ పవన్ వారాహి యాత్రకు బయల్దేరితే బీజేపీ కలిసి వస్తుందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
స్వతహాగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు పవన్ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలిపారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క శాతం ఓటు కూడా లేదు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉండటం, మిగతా పక్షాలు వీక్ అవడం వల్ల మోడీ-అమిత్ షాల ద్వయానికి మిగతా పార్టీలు ప్రాధాన్యమివ్వాల్సి వస్తుంది. రాష్ట్రాల్లోని పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఉండాలని కషాయం నేతలు భావిస్తున్నారు. ఆ క్రమంలో పవన్ చేరతానంటే సాదరంగా ఆహ్వానించారు. కానీ, ఆయనకు ఏ విధమైన అస్త్రాలను అప్పగించలేదు.
ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ, జనసేన నేతల కంటే వైసీపీ పెద్దలు ఈ విషయంపై ఎక్కువగా ఫోకస్ చేశాయి. జనసేనను రాష్ట్రంలో ఎదగనీయకుండా చేయాలన్నదే జగన్ అండ్ కో మొదటి నుంచి భావిస్తున్నారు. ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతికొద్ది మంది మాత్రమే ఆయనతో ఉన్నారు. ఇప్పుడు అశేషమైన జనవాహిని ఆయన వెంట ఉంది. ఇక వారాహి రూపంలో రాష్ట్రంలో పర్యటన చేపడితే భారీ స్థాయిలో ఓటింగ్ తేడా వస్తుంది. అది టీడీపీకి అనుకూలంగా మారితే వైసీపీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. దాంతో వైసీపీ డిఫెన్స్‌లో పడి పవన్ ను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

2014లో టీడీపీతో కలిసివెళ్లిన బీజేపీ ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దూరంగా జరిగింది. 2019లో ఇతోధికంగా వైసీపీకి సహకరించింది. అధికారికంగా పొత్తు లేకపోయినా, వైసీపీ, బీజేపీలు కలిసే ఉన్నాయి. ఆ తరువాత జనసేన ఢిల్లీ పెద్దలతో దగ్గరైనా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ గతం కంటే చాలా వీక్ అయిపోయింది. అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఇష్టపడుతోంది. పవన్ కల్యాణ్ తనకు బీజేపీ సహకారం అందిస్తే ప్రభుత్వ ఏర్పాటు చేస్తానని కుండబద్దలు కొడుతున్నా, అటు నుంచి స్పందన పెద్దగా రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో పవన్ ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధపడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చగలిగితేనే పవన్ అనుకున్నది సాధ్యపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.