Pawan Kalyan- Nara Lokesh: ఏపీలో అందరి లక్ష్యం ఒకటే. 175కు 175 స్థానాలు కొట్టెస్తే పోలే అని జగన్ చెబుతుండగా.. ఎలా గెలుస్తావో చూస్తానని జనసేనాని పవన్ హెచ్చరిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యమని ప్రకటించారు. అటు చంద్రబాబు, ఆయన తనయుడు లోకోష్ జోరు పెంచారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. సీఎం జగన్ మరోసారి అధికారాన్ని పదిలపరుచుకోవాలని ప్రయత్నిస్తుండగా.. చంద్రబాబు, పవన్ లు మాత్రం జగన్ ను గద్దె దించాలని పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. భావసారుప్యతతో పనిచేస్తున్నారు. తమ ముందున్న లక్ష్యం జగన్ కు అధికారాన్ని దూరంచేయడమేనంటున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పవన్ కూడా తాను ప్రజలు కోరుకుంటేనే సీఎం అవుతానని.. ఎన్నికల తరువాత జరిగే పరిణామాలను పక్కన పెట్టి పోరాటం చేస్తున్నారు. గతంలో ఉన్న వైరుధ్యాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.

లోకేష్ జనవరి 27 నుంచి తన పాదయాత్రను స్టార్ట్ చేయనున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు కాలినడకన తిరగనున్నారు. 100 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగనున్న పాదయాత్రను యువగళం అని పేరు పెట్టారు. పాదయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్ సైతం ప్రకటించారు. నిరుద్యోగ అంశాన్ని టార్గెట్ చేసి యువత, విద్యార్థులతో లోకేష్ మమేకం కానున్నారు. అటు మహిళ సమస్యలను ప్రస్తావించనున్నారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే అంశాలను, సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రజలకు వివరించనున్నారు. కేవలం జగన్ ను గద్దె దించడమే లోకేష్ లక్ష్యం. అలాగే తన తండ్రి చంద్రబాబును సీఎం చేయాలన్న కసితో ఆయన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
అటు పవన్ బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ప్రచార రథం వారాహితో పాటు కాన్వాయ్ వాహనాలు సిద్ధమయ్యాయి. యాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్ ఖరారు చేసే పనిలో హైకమాండ్ ఉంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ పవన్ యాత్ర కొనసాగనుంది. అంతకు ముందుగానే జిల్లాల వారీగా యువభేరీలు నిర్వహించడానికి నిర్ణయించారు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో తొలి యువభేరీ నిర్వహించనున్నారు. అటు తరువాత మత్స్యకారులు, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారసేన, గిరిసేనలు ఏర్పాటుచేయనున్నారు. దీంతో యుద్ధ భేరీ మోగించనున్నారు పవన్.

అయితే పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు గమనించాలి. గతంలో ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టేసి కేవలం జగన్ ను గద్దెదించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. తరాలుగా నందమూరి కుటుంబంతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి బాలయ్యతో కలిశారు. ఆయన హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ వెళ్లారు. రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యానికి చెక్ చెప్పాలంటే కాపులు, కమ్మ సామాజికవర్గం వారు కలవాల్సిన తప్పని పరిస్థితిని సైతం గుర్తించారు. అందుకే ఆ సామాజికవర్గంతో స్నేహం చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అటు సీఎం పదవి విషయంలో కూడా కొంత రాజీ ధోరణితో వ్యవహరించారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా సీఎం అవుతానని చెబుతూనే.. ఎన్నికల తరువాత అంశంగా చూపించారు. మొత్తానికైతే అటు టీడీపీ, ఇటు జనసేనలో ఒకే భావసారుప్యత కనిపిస్తోంది. అదే ‘వైసీపీ విముక్త ఏపీ’ అన్నమాట.