
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా, యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో జనవరి 25న పఠాన్ సినిమా విడుదలయింది. ఇది భారీ విజయాన్ని అందుకుంది. గత కొద్దిరోజులుగా సరైన హిట్లు లేని బాలీవుడ్‌కు కొత్త ఊపిరి ఇచ్చింది. పఠాన్ సినిమాతో థియేటర్లర్నీ కళకళకలాడాయి. మరో వైపు ఈ సినిమా టికెట్ ధరలు తగ్గించడం, ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ ఆఫర్లు ప్రకటించడంతో థియేటర్లు ప్రేక్షకులతో సందడిగా మారాయి. పోటీగా మరే చిత్రాలు లేకపోవడం, వచ్చిన సినిమాలు బక్సాఫీస్ వద్ద నిలబడకపోవడంతో పఠాన్ జోరుకు అడ్డే లేకుండా పోయింది.
-బాహుబలి-2 రికార్డు బద్దలు
ఇక జనవరి 25న విడుదలయిన పఠాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలయిన నెలరోజుల్లో అన్ని భాషల్లో కలిపి రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తాజాగా హిందీలో 511.70 కోట్లు(నెట్) వసూలు చేసి బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ హిందీలో అత్యధిక వసూళ్ల రికార్డు బాహుబల్లి-2(510.99 కోట్లు) పేరిట ఉండేది. బాహుబలి-2 తర్వాత ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్-2(434.70 కోట్లు), నితీష్ తివారీ, అమీర్ ఖాన్ దంగల్(374.43 కోట్లు), రాజ్‌కుమార్ హిరాణీ, రణబీర్ కపూర్ సంజూ(342.53 కోట్లు) చిత్రాలు ఉన్నాయి.
-చిత్ర యూనిట్ హర్షం
ఇక ఆరోవారానికి పఠాన్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో కలిపి 18.26 కోట్లు వసూలు చేయగా, మొత్తం హిందీతో కలిపి 529.96 కోట్లు(నెట్) వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు చిత్రబృందం వినూత్నంగా ప్రచారం చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బేషరమ్ పాట విమర్శల పాలుకావడంతో చిత్ర యూనిట్ కోరుకున్న పబ్లిసిటీ వచ్చింది. చాలా రోజుల తర్వాత షారుఖ్‌ఖాన్ నటించిన చిత్రం కావడం, యాక్షన్‌ఘట్టాలు అలరించడంతో ప్రేక్షకులు సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఇక ఈ సినిమా బాహుబలి-2 రికార్డును అధిగమించడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.