Anand Mahindra: ప్రయాణికుల కోసం యువకుడి పూల పందిరి.. ఆనంద్ మహీంద్రా కు భలే నచ్చింది

తడి ఊరు, రాష్ట్రం తెలియదు గానీ.. అతడి పేరు ముఖేష్. చూస్తుంటే పెద్దగా అక్షరాస్యుడి లాగా (వీడియోలో మాట్లాడుతుంటే) కనిపించడం లేదు. అతడిది మారుమూల గ్రామం. ఎప్పుడో ఒకసారి బస్సులు వచ్చి వెళ్తుంటాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : March 29, 2024 2:49 pm

Anand Mahindra

Follow us on

Anand Mahindra: మన ఇంట్లో లేదా పెరట్లో అలంకరణ కోసం పూల మొక్కలు పెంచుకుంటాం. దేవుడికి పూజ చేసేందుకు, ఆడవాళ్ళు ఉంటే జడలో పెట్టుకునేందుకు ఉపయోగిస్తాం. పూలను చూస్తే ఎవరికైనా ఆశావాహ దృక్పథం కలుగుతుంది కాబట్టి.. చాలామంది పూల మొక్కలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాలం మారుతున్న కొద్దీ మొక్కల తయారీలోనూ సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కుండీలలో పెరిగే మొక్కలు కూడా పూలు పూస్తున్నాయి. కానీ ఓ వ్యక్తి ఇంట్లో కాకుండా బాటసారుల కోసం ఓ పూల మొక్కను పెంచాడు. పెంచడం మాత్రమే కాదు దానిని సొంత బిడ్డ కంటే ఎక్కువ సంరక్షించాడు. అతడి కష్టం వృధా కాలేదు. అది ఏపుగా పెరిగి 10 మందికి నీడనిస్తోంది. ఇది మన దేశంలో సుప్రసిద్ధ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కి నచ్చింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

అతడి ఊరు, రాష్ట్రం తెలియదు గానీ.. అతడి పేరు ముఖేష్. చూస్తుంటే పెద్దగా అక్షరాస్యుడి లాగా (వీడియోలో మాట్లాడుతుంటే) కనిపించడం లేదు. అతడిది మారుమూల గ్రామం. ఎప్పుడో ఒకసారి బస్సులు వచ్చి వెళ్తుంటాయి. ఆ బస్సులు ఆగే చోట నిలువ నీడ లేదు. నీడ ఉన్నచోట బస్సులు ఆపరు. అందుకే అతడికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. ప్రయాణికులకు నీడనివ్వాలి.. చూసేందుకు ఆకర్షణగా కనిపించాలి.. ఈ ఐడియాతో బొగన్ విలియా అనే మొక్కను నాటాడు. ఈ మొక్కను తెలుగు రాష్ట్రాలలో కాగితపు పూల మొక్క అంటారు. దీని పూలు ఎరుపు, నారింజ రంగు మిశ్రమంలో ఉంటాయి. చూడడానికి కాగితం కంటే తక్కువ మందంలో ఉంటాయి. అందుకే వీటిని కాగితపు పూలు అంటారు. ఈ బొగన్ విలియా మొక్క తక్కువ నీటిని తీసుకొని ఎక్కువ పూలు పూస్తుంది. పైగా దానికి మొనదేలిన ముళ్ళు ఉంటాయి. అందుకే ముఖేష్ ఈ మొక్కను నాటాడు. 12 సంవత్సరాల క్రితం నాటిన ఈ మొక్క విస్తారంగా పెరిగి పెద్ద వృక్షమైంది. దాని కొమ్మలు విస్తరించి ఒక పూల పందిరి లాగా మారింది.

దీంతో ఈ ప్రాంతంలో బస్సులు ఎక్కే ప్రయాణికులు ఈ పూల పందిరి కింద సేద తీరుతున్నారు. మండే ఎండలోనే కాదు.. విస్తారంగా కురిసే వర్షాల్లోనూ ఈ చెట్టు ప్రయాణికులకు నీడనిస్తోంది. కొన్ని కొన్ని సార్లు ఎండలో పడి వచ్చే బాటసారులు కూడా ఈ చెట్టు నీడన కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ విషయం ఎలా తెలిసిందో.. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఈ యువకుడి పూల పందిరి గురించి ప్రస్తావించారు. “12 సంవత్సరాల క్రితం ముఖేష్ కాగితపు పూల మొక్కను నాటారు. అది ఏపుగా పెరిగింది. ఏకంగా వృక్షమైంది. కాగితపు పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రయాణికులు దీని నీడన సేద తీరుతున్నారు.. ఒక వ్యక్తి తపనతో నాటిన ఈ మొక్క ఎంతో మందికి నీడనిస్తోంది. అతడు నాటిన ఈ మొక్క ఈ ప్రాంతానికి అందాన్ని కూడా తీసుకొచ్చిందని” ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. ఆనంద్ పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ముఖేష్ ను తమకు పరిచయం చేసినందుకు ఆనంద్ మహీంద్రా కు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.