Senior NTR Sons: సీనియర్ ఎన్టీఆర్ కి 12 మంది సంతానం. అందులో 8 మంది కుమారులు, 4గురు అమ్మాయిలు. పురంధరేశ్వరి అమ్మాయిలలో పెద్దవారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వివాహం చేసుకున్న పురంధరేశ్వరి రాజకీయాల్లో రాణిస్తున్నారు. లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమా మహేశ్వరి మిగతా ముగ్గురు కుమార్తెలు. ఉమామహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించారు. భువనేశ్వరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి. ఇక 8 మంది అబ్బాయిల్లో బాగా పాపులర్ అయ్యింది మాత్రం ఇద్దరే. బాలకృష్ణ తండ్రి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. స్టార్ హీరోగా ఎదిగారు. రాజకీయ ప్రవేశం చేసి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .

అలాగే హరికృష్ణ కూడా తెలుగు ప్రజలకు పరిచయమే. మిగతా ఆరుగురు కుమారుల గురించి తెలిసింది చాలా తక్కువ. వీరు అంత ఫేమస్ కాలేకపోయారు. విశేషం ఏమిటంటే వారి పిల్లలు కూడా వెలుగులోకి రాలేదు. దీంతో ఎన్టీఆర్ కుమారులు ఎవరు? ఏం చేస్తున్నారు? అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే… ఎన్టీఆర్ మొదటి సంతానం అబ్బాయి. ఆయన పేరు రామకృష్ణ. ఆయన నిర్మాతగా మారారు. ఆయన పేరున ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో ఏర్పాటు చేశారు. ఈయన కన్నుమూశారు.
రెండో సంతానం కూడా అబ్బాయే. ఆయన పేరు జయకృష్ణ. ఈయన చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు సమాచారం. మూడో కుమారుడి పేరు సాయి కృష్ణ. ఈయన 2004లో చనిపోయారు. దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడిన సాయి కృష్ణ అకాల మరణం పొందారు. నాలుగో కుమారుడు హరికృష్ణ. జనాల్లో పాపులారిటీ సాధించిన ఎన్టీఆర్ వారసుల్లో హరికృష్ణ ఒకరు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉన్న హరికృష్ణ… నటుడిగా కూడా రాణించారు. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు. ఈయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యారు.

ఎన్టీఆర్ ఐదో కుమారుడు మోహనకృష్ణ. ఈయన గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఇక బాలయ్య ఎన్టీఆర్ కి ఆరవ కొడుకు. ఎన్టీఆర్ సంతానంలో అత్యంత అందగాడిగా బాలకృష్ణకు పేరుంది. దీంతో టీనేజ్ నుండే నటుడిగా బాలకృష్ణను ఎన్టీఆర్ ప్రోత్సహించారు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ బాలకృష్ణ అతిపెద్ద స్టార్ గా ఎదిగారు.నందమూరి వంశం, ఎన్టీఆర్ కొడుకులు అంటే మొదట గుర్తొచ్చేది బాలయ్యే. బాలయ్య తర్వాత ఎన్టీఆర్ కి మరో ఇద్దరు కొడుకులు జన్మించారు. వారి పేర్లు రామకృష్ణ జూనియర్, జయశంకర కృష్ణ. వీరిద్దరి గురించి కూడా తెలిసింది తక్కువే. ఇది ఎన్టీఆర్ సంతానం గురించి పూర్తి సమాచారం.