
RRR: ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఏడాది కావస్తుంది. ఇంకా ఆ సినిమా సందడి తగ్గలేదు. తగ్గలేదు అనడం కంటే తగ్గకుండా చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ తెప్పించాలనే ప్రణాళికలో భాగంగా ఇదంతా రాజమౌళి చేస్తున్న వ్యవహారం. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎన్ని అంతర్జాతీయ గౌరవాలు దక్కినా, అవార్డులు లభించినా అది రాజమౌళి కష్ట ఫలితమే. కష్టం అంటే సినిమా తీయడంలో అనుకునేరు, పబ్లిసిటీ చేయడంలో. ఆర్ ఆర్ ఆర్ విడుదలైనప్పటి నుండి అమెరికాలోనే తిష్టవేసిన రాజమౌళి ఆస్కార్ యజ్ఞం చేస్తున్నారు. ఆ యాగానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు.
అసలు ఆస్కార్ గెలవాలంటే? కనీసం అక్కడ వరకు వెళ్లాలంటే ఏం చేయాలి?. దీనిపై రాజమౌళి టీం పెద్ద అధ్యయనం చేశారు. వేల సంఖ్యలో ఉండే అకాడమీ సభ్యుల దృష్టిలో సినిమా పడాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు. నెలలుగా అదే పనిలో ఉన్నారు. అమెరికన్ మీడియా ఆర్ ఆర్ ఆర్ గురించి రాసేలా చేశారు. అమెరికన్ ఫిలిం క్రిటిక్స్ కి స్పెషల్ షోలు వేసి వారితో సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టించారు. జపాన్ లో విడుదల చేయడం, అక్కడ భారీ విజయం సాధించిందని మీడియాలో వార్తలు రాయించడం… చాలా చాలా విషయాలు జరిగాయి. ఆ మూవీ గురించి వచ్చిన సంగతులు ప్రమోషన్స్ లో భాగమే. ఆస్కార్ కోసం జరిగిన ప్రణాళికే.
కోట్లు ఖర్చుపెట్టి పీఆర్ టీమ్ లను ఏర్పాటు చేసుకున్నారు. ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిలిపేందుకు రాజమౌళి కేటాయించిన బడ్జెట్ రూ. 50 కోట్లకు పైనే. ఈ డబ్భు ఎవరు భరించాలి! నిజానికి నిర్మాత దానయ్య ఖర్చు చేయాలి. ఆర్ ఆర్ ఆర్-ఆస్కార్ అనే అంతర్జాతీయ డ్రామాలో ఆయన పాత్ర లేకుండా పోయింది. కారణం ఈ బడ్జెట్ తో ఆయనకు సంబంధం లేదు. సొంతగా రాజమౌళి చేస్తున్న వ్యవహారం. దానయ్య కాకుండా రూ. 50 కోట్లు ఎవరు ఖర్చు చేశారంటే… శోభు యార్లగడ్డ మీద డౌట్ వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్యను పక్కన పెట్టి యార్లగడ్డను పక్కన తిప్పుకుంటున్నారు రాజమౌళి.

గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో శోభు యార్లగడ్డ ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో జాయిన్ అయ్యాడు. అసలు దానయ్యకు సంబంధం లేదని చెప్పడానికి మరొక ఉదాహరణ… గోల్డెన్ గ్లోబ్ అందుకున్న కీరవాణి నిర్మాత దానయ్య పేరు చెప్పకపోవడం. ఇక శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఆయనకు నెక్స్ట్ మూవీ చేస్తానని రాజమౌళి ప్రామిస్ చేసి ఉండొచ్చు. అసలు ఆర్ ఆర్ ఆర్ హీరోలతో కూడా రాజమౌళి డబ్బులు ఖర్చు చేయించాడనే వాదన కూడా కొట్టిపారేయలేం. ఆస్కార్ అవార్డుతో వచ్చే ఫేమ్ కంటే పది ఇరవై కోట్లు ఎక్కువ కాదని ఎన్టీఆర్, రామ్ చరణ్ భావించవచ్చు. ఈ మధ్య ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ బాధ అదేనట. ఆస్కార్ పై పెట్టుకున్న ఆశలు, రాజమౌళి ప్రామిస్లు గల్లంతు కావడంతో వచ్చిన అసహనం అంటున్నారు.
ఇక రాజమౌళి కోట్లు కుమ్మరించి చేసిన ఆర్ ఆర్ ఆర్ – ఆస్కార్ యజ్ఞం ఫలితంగా ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ లో నిలిచింది. ఈ సాంగ్ కి ఆస్కార్ రావడం గొప్ప గొప్ప కళాఖండాలను అవమానించడమే. ఎందుకంటే ఇదేమీ గొప్ప ట్యూన్ కాదు, భారతీయ సాహిత్యం గౌరవం పెంచే లిరిక్స్ అంతకన్నా కావు. నిజం చెప్పాలంటే కీరవాణి ఇంతకంటే గొప్ప ట్యూన్స్ ఇచ్చారు, చంద్రబోస్ భావుకతతో కూడిన సాహిత్యం అనేక పాటలకు రాశారు. పోయి పోయి నాటు నాటు అనే ప్రమాణాలు లేని పాట ఆస్కార్ బరిలో నిలిచింది. చూస్తుంటే కొన్ని సినిమాల విషయంలో ఆస్కార్ అనేది ప్రతిభకు కాకుండా పబ్లిసిటీకి దక్కే పురస్కారం.
ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడం ద్వారా ఆర్ ఆర్ ఆర్ అతిపెద్ద గౌరవాన్ని దక్కించుకుంది. దీని వెనుక కర్త కర్మ క్రియ రాజమౌళినే. నాటు నాటుకి ఆస్కార్ వస్తే రాజమౌళి బ్రదర్స్ పేర్లు మారుమ్రోగుతాయి. క్రెడిట్ మొత్తం రాజమౌళి కుటుంబానికే దక్కుతుంది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు ఖర్చు చేసింది వారు, ప్రణాళికలు వేసింది వాళ్ళు. అనవసరంగా చంద్రబోస్ కి క్రెడిట్ ఇవ్వాల్సి రావడం వారిద్దరూ బాధపడే అంశం. కీరవాణికి రచనలో కూడా ప్రావీణ్యం ఉంది కాబట్టే ఆయనే రాసుకుంటే పోయేది. ఇప్పుడు తప్పు తెలిసింది కాబట్టి… నెక్స్ట్ నుండి ఆయన జాగ్రత్త పడతారులే.