
ప్రపంచంలో మనం ఎప్పుడూ వినని, చూడని ఎన్నో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ వింతలలో కొన్ని వింతలు మనల్ని ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. భూమి ఎన్నో రహస్యాలకు పుట్టినిల్లు. అద్భుతాలకు నెలవు అయిన ఈ భూమిలో ఒకచోట చలి ప్రజలను గజగజా వణికిస్తుంటే మరోచోట ఊహించని స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. వింత వాతావరణాలు ఉన్న గ్రామాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.
ఒక వింత గ్రామం వర్షం పడని గ్రామంగా పేరు తెచ్చుకుంది. మేఘాలయాలోని మాసిన్రామ్ గ్రామం ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే గ్రామంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామానికి పూర్తి భిన్నమైన గ్రామం యుమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. వర్షాలు పడని ఈ వింత గ్రామం పేరు ఆల్ హుతైబ్. భూ ఉపరితలానికి ఈ గ్రామం ఏకంగా 3,200 మీటర్ల ఎత్తులో ఉండటం గమనార్హం.
వర్షం కురవని ఈ గ్రామానికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. శీతాకాలంలో ఇక్కడ ఉదయం సమయంలో వాతావరణం చల్లగా ఉన్నా సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రం వాతావరణం వేడెక్కుతుంది. వాతావరణం వేడిగా ఉంటుందని తెలిసినా పర్యాటకులు మాత్రం ఈ గ్రామానికి వస్తూనే ఉంటారు. పురాతన నిర్మాణాలతో పాటు ఆధునిక నిర్మాణాలు ఉండటం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత.
ఈ గ్రామం మేఘాల కంటే పైన ఉండటం వల్ల ఈ గ్రామంలో ఎప్పటికీ వర్షం పడదు. అయితే ఈ గ్రామంపై నుంచి కిందన వర్షాలు పడటాన్ని మాత్రం చూడవచ్చు. ఎక్కడా చూడని ప్రత్యేకత ఉన్న ఈ గ్రామం పర్యాటకులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.