Odisha- Ant Attacks: చీమలు, ఈగలు చూడడానికి చిన్న ప్రాణులే అయినా.. అవి మహా శక్తివంతమైనవి. గుంపుగా దాడిచేసి ప్రాణాలను హరిస్తాయి. అందుకే సుమతి శతకంలోనే చీమల శక్తిని వర్ణించారు మహా కవి. ఎంతటి బలవంతమైన సర్పమైనా చిన్నపాటి చీమల చేతచిక్కితే మృత్యువు తప్పదని హెచ్చరించారు. అది నిజమే… శక్తివంతులమని విర్రవీగే జంతువులకు చీమలు తమ ప్రతాపం చూపించిన సందర్భాలున్నాయి. ఇటీవల మనిషి ఇష్టంగా భావించే బంగారు గొలుసును గుంపుగా చేరి తమ స్థావరంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చీమలు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమని ఈ ఘటన తేటతెల్లం చేసింది. అటువంటి చీమలు ఇప్పుడు ఏకంగా ఒక గ్రామంపై దండెత్తాయి. తొలుత పదుల సంఖ్యలో చేరి.. అనక వందలు, వేలు, లక్షలుగా మారి ఆ గ్రామంలో విరవిహారం చేస్తున్నాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా సంచరిస్తూ గ్రామస్థులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. చీమలు కుడుతుండడంతో చేతిలో వాపులు, దురదలు వస్తుండడంతో గ్రామస్థులు ఆస్పత్రిపాలవుతున్నారు.

ఒడిశాలోని చంద్రదేయ్ పూర్ లోని బ్రాహ్మణసాహి అనే గ్రామం ఉంది. అయితే గత రెండు నెలల కిందట ఎర్ర చీమల రాక ప్రారంభమైంది. కానీ గ్రామస్థులు లైట్ తీసుకున్నారు. చీమలే కదా అని భావించారు. కానీ రోజురోజుకూ వాటి సంఖ్యపెరుగుతూ వచ్చింది. ఇప్పుడు లక్షలాది సంఖ్యకు చేరుకుంది. మనుషులపై దాడులు చేస్తుండడంతో గ్రామస్థులు భయపడుతున్నారు. కొందరు వేరే గ్రామాలకు వలసపోయారు. చీమల నియంత్రణకు గ్రామస్థులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంటి మట్టి గోడల్లో తిష్టవేశాయి. పంటలను, ఆహారాన్ని.. ఇలా దేన్నీ విడిచిపెట్టడం లేదు. ఉదయం ఇంట్లో ఉండే వస్తువు.. సాయంత్రానికి చీమలపాలవుతోంది. చీమలు ఆ గ్రామస్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటి నుంచి కాపాడాలంటూ గ్రామస్థులు ఒడిశా ప్రభుత్వానికి వేడుకున్నారు. అయితే చీమలను ఎలా నియంత్రించాలనే దానిపై ఒడిశా అధికారులు స్టడీ చేస్తున్నారు.
తమిళనాడులో ఇటువంటి ఘటనే ఒకటి ఈ మధ్యన వెలుగుచూసింది. అటవీ ప్రాంతంలో గ్రామాలపై లక్షలాది చీమలు దండయాత్ర చేశాయి. ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయి. ఎల్లో క్రేజీ యాంట్స్ గా పిలవబడే ఈ చీమలు ఏకంగా ఏడు గ్రామాలపై దండెత్తాయి. దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్టులో లక్షలాదిగా పుట్టుకొచ్చాయి. అటు పంట పొలాలను నాశనం చేశాయి. అటవీ ఉత్పత్తును సైతం తినేశాయి. మేకలు, గొర్రెలు, ఇతర పశువులకు హాని చేశాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లను పూర్తిగా స్వాహా చేశాయి. పాములు, బల్లులను అయితే చుట్టుముట్టి మరీ భోంచేశాయి. దీనిపై అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నివారణ చర్యలకు పూనుకుంది.

అయితే తమిళనాడు తరువాత ఇప్పుడు ఈ చీమల దండు ఒడిశాలో వెలుగుచూడడం విశేషం. స్థానిక ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. వేరే ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. అయితే చీమల వల్లే ప్లేస్ మారామని చెబుతుండడంతో విన్నవారు షాక్ కు గురవుతున్నారు. చీమల వల్ల విలువైన ఆస్తులను, ఉన్న ఇళ్లను విడిచిపెడుతుండడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీమల కట్టడిని ప్రత్యేక డ్రైవ్ చేపట్టాని ఒడి శా ప్రభుత్వానికి కోరుతున్నారు.
Also Read:Ganesh Immersion Politics: టీఆర్ఎస్, బీజేపీ.. ఓ నిమజ్జన రాజకీయం?