Ramagundam : ఆర్థికంగా స్థితిమంతులను టార్గెట్ చేయడం.. పెళ్లి పేరిట వలపు వల విసరడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తీరా వివాహం అయ్యాక కొద్దిరోజుల పాటు అతడ్ని నమ్మించి ఉన్నదంతా ఊడ్చి పరారీ కావడం ఆమె నైజం. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా నలుగుర్ని ఈ విధంగానే వివాహం చేసుకుంది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టి నిలువు దోపిడీకి పాల్పడింది. ఏకంగా నలుగురు యువకులను తన బుట్టలో వేసుకొని మోసం చేసిందంటే ఆ కి‘లేడీ’ తెలివితేటలు ఏపాటివో ఇట్టే అర్ధమవుతోంది.
రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన యువకుడు స్థానికంగా షాపు నిర్వహిస్తుంటాడు. ఆర్థికంగా స్థితివంతమైన కుటుంబమే. ఈ నేపథ్యంలో ఆయన వివాహం చేసుకునేందుకు ఓ మ్యాట్రీమోనీని ఆశ్రయించాడు. తన కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తదితర వివరాలను నమోదుచేశాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పూర్ కు చెందిన యువతి నుంచి రిప్లయ్ వచ్చింది. ఇరువురి అభిప్రాయాలు కలవడంతో ఇరు కుటుంబాలు ఘనంగా పెళ్లి చేశాయి. కొద్దిరోజుల పాటు నవ దంపతులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఓ ఫైన్ మార్నింగ్ నూతన వధువు కనిపించకుండా పోయింది.
దీంతో సదరు యువతి కోసం భర్త ఆ చోటా..ఆ చోటా వెతికాడు. అత్తింటి వారితో పాటు ఆమె బంధు, మిత్రుల వద్ద ఆరాతీశాడు. కానీ ఆయనకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అదే సమయంలో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు కనిపించకపోయేసరికి ఓ నిర్ధారణకు వచ్చాడు. ఆమెకు ఇది వరకే మూడు వివాహాలు జరిగాయని.. ముందు ముగ్గురిది ఇదే పరిస్థితి అని తెలుసుకొని లబోదిబోమన్నాడు. ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.