
TSPSC Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏఈ ప్రశ్నపత్రం లీక్ కు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏ-1 ప్రవీణ్ పెన్ డ్రైవ్, సెల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అందులో ప్రశ్న పత్రాలు, యువతుల నగ్న ఫొటోలు, వాట్సాప్ చాటింగ్‌లు కనుగొన్నారు. ఏ-2 రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత కూపీ లాగగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్న పత్రాల లీక్‌కు సంబంధించి రేణుక, ప్రవీణ్ ముందుగానే చర్చించుకున్న తర్వాత ఈ వ్యవహారంలోకి దిగారని సిట్ అధికారులు అంటున్నారు. రేణుకతో ఉన్న సన్నిహిత సంబంధం నేపథ్యంలో ప్రవీణ్ ప్రశ్న పత్రం లీక్‌కు తెగించాడని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రవీణ్‌ను కలిసేందుకు ప్రతి శనివారం రేణుక మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ నుంచి వచ్చేది. ఇద్దరూ ఆదివారం సన్నిహితంగా గడిపేవారు. తర్వాత సోమవారం తెల్లవారుజామునే ఆమెను ఎంజీబీఎస్ బస్టాండ్‌లో బస్సు ఎక్కించేవాడు. ఒక్కోసారి ఆమె తన కారులో వచ్చేది. ప్రశ్న పత్రం లీకేజీ ప్రస్తావన ఇద్దరి మధ్య రావడం, తన సోదరుడు రాజేష్ నాయక్ మునిసిపల్ ఏఈ ఉద్యోగానికి ప్రీపేర్ అవుతున్న నేపథ్యంలో రేణుక పేపర్ లీక్ చేయాలని ప్రవీణ్‌ను ఉసిగొల్పినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు.
నిన్నటి వరకూ ప్రవీణ్ పెన్ డ్రైవ్ నుంచి మునిసిపల్ ఏఈ ప్రశ్నపత్రమే ఉందని చెప్పిన దర్యాప్తు బృందం అధికారులు.. గురువారం మరో నాలుగు ప్రశ్న పత్రాలు ఉన్నట్టు వెల్లడించారు. ప్రవీణ్ లీక్ చేసిన ప్రశ్నపత్రాల్లో మునిసిపల్ ఏఈ, పశుసంవర్థక శాఖకు సంబంధించిన ప్రశ్నపత్రం, మిగతా మూడు శాఖల ఉద్యోగాలకు సంబంధించి ఉన్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. సిట్ అధికారుల విచారణ లో మొదట్లో తనకేం తెలియదని బుకాయించిన ప్రవీణ్.. వారిదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయాలను పూసగుచ్చినట్టు తెలిపాడు. ప్రవీణ్ ఫోన్‌లో సుమారు 60 మంది మహిళల నంబర్లు ఉన్నాయి. వారిలో కొందరితో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరు ఉన్నారు? వీరు ఇంకేమైనా పేపర్లు లీక్ చేశారా అనే వ్యవహారాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. చూడబోతే ఇది మొత్తం ప్రభుత్వానికి పెద్ద తలకాయనొప్పిలాగా పరిణమించే అవకాశం కన్పిస్తోంది.

ఇక ప్రవీణ్ 2017 నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పని చేస్తున్నాడు. అప్పటి నుంచి కీలకమైన ప్రశ్నపత్రాల తయారీ విభాగంలోనే పని చేస్తున్నాడు. పైగా ఆ విభాగంలో పని చేసే ఓ మహిళా ఉద్యోగి ప్రవీణ్‌కు అతి ప్రాధాన్యం ఇచ్చేది. సదరు ఉద్యోగిని భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఆమెకు టీఎస్ పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చింది. ప్రవీణ్‌కు ఆ ఉద్యోగినికి సన్నిహిత సంబంధం ఉన్న నేపథ్యంలో ఆ విభాగంలో అతడు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఏఈ ప్రశ్నపత్రాన్ని అతడు రాజశేఖర్‌రెడ్డి సహాయంతో పెన్ డ్రైవ్‌లో కాపీ చేస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా సదరు మహిళా ఉద్యోగిని చైర్మన్ చాంబర్‌లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆ మహిళా ఉద్యోగిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.