Dil Raju: నైజాం కింగ్, చిత్ర పరిశ్రమను శాసించే రారాజు, స్టార్ ప్రొడ్యూసర్, బడా డిస్ట్రిబ్యూటర్… దిల్ రాజు ప్రొఫైల్ ని వివరిస్తూ చిన్న పుస్తకం రాయొచ్చు. సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినిమాను కనుసైగలతో కంట్రోల్ చేసే నవాబుగా ఎదిగాడనేది నిజం. ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలనేది నిర్ణయించేది దిల్ రాజే అంటారు . ఆయన కటాక్షం లేకుండా సినిమా థియేటర్స్ లో ఆడటం అంత ఈజీగా కాదు. ఈ క్రమంలో దిల్ రాజుపై తీవ్ర వ్యతిరేకత, అసహనం పరిశ్రమలో గూడుకట్టుకుందనే వాదన వినిపిస్తోంది. ఆ కారణంగానే వారసుడు మూవీ విడుదల వివాదాస్పదం అవుతుంది అంటున్నారు. ఇలాంటి పలు ప్రశ్నలకు దిల్ రాజు సమాధానాలు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంట్లో రాజు అని పిలిచేవారు… నిర్మాతగా నా ఫస్ట్ మూవీ దిల్. రాజుకు దిల్ తగిలించి దిల్ రాజు చేశారు. డిస్ట్రిబ్యూటర్ గా ఉంటే ప్రేక్షకుడి మాదిరి సినిమా థియేటర్లో లో చూడాలి. దాని ఫలితం ఏమిటని ఎదురు చూడాలి.అందుకే నిర్మాతగా మారాను. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ కి సినిమా చూపించరు. కేవలం అంచనాలతోనే కొనాలి. నిర్మాతగా మారడానికి ఇది కూడా కారణం. నిర్మాణంలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. డబ్బులు పెట్టేది నిర్మాత తీసుకునేది మరొకరు.
బాహుబలి1 అన్ని వందల కోట్లు వసూలు చేసినా నిర్మాతకు మిగిలింది ఏమీ లేదు. ప్రొడ్యూసర్ గా 20 ఏళ్ళు పరిశ్రమలో ఉన్నాను. నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన నా మిత్రులు రియల్ ఎస్టేట్ వైపు వెళ్లి ఉన్నత స్థాయిలో ఉన్నారు. నేను ఇక్కడే మిగిలిపోయాను. సినిమా వలన నేమ్ ఫేమ్ వస్తుంది అంతే. హీరో పేరు చెప్పి నిర్మాత సినిమా అమ్మేస్తారు. నిర్మాతల వలనే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒకప్పుడు నలుగురు వ్యక్తులు కలిసి డిస్ట్రిబ్యూషన్ ని కంట్రోల్ చేశారు అన్నారు. మోనోపోలీ వచ్చిందన్నారు. 37 థియేటర్స్ తో పరిశ్రమను కంట్రోల్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ ఏ ఒక్కరూ సినిమా బిజినెస్ ని శాసించలేదు.
.

పేరుకే సినిమా వాళ్లంతా ఒక కుటుంబం… వాస్తవంలో ఎవరి నిర్ణయాలు వారివే. అందరూ కలిసి ఉండటం జరగని పని. సినిమా అంటేనే సిగ్గులేని, నీతిమాలిన, మానం లేని వ్యవస్థ. వారసుడు విడుదలను కొందరు కావాలనే వివాదం చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు. అయితే నేను ఎవరినీ పాయింట్ చేసి మాట్లాడను. ఒక స్టార్ హీరో వంద కోట్లు తీసుకుంటున్నాడంటే, తన తప్పులేదు. ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పేముంది. దిల్ రాజు అనే ఒక బ్రాండ్ పడింది, కొందరిలో అసూయ పెరిగింది. రెండు దశాబ్దాల ప్రస్థానంలో నేను నిర్మాతగా లాభాల్లోనే ఉన్నాను, అని దిల్ రాజు అనేక విషయాలపై తన అభిప్రాయం తెలియజేశారు. మీకు పొలిటికల్ లీడర్స్ డబ్బు సమకూరుస్తున్నారట కదా అని అడగ్గా, దిల్ రాజు ఖండించారు.