Coronavirus: ఏ క్షణాన చైనాలో కోవిడ్ 19 వెలుగు చూసిందో.. అప్పటినుంచి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతూనే ఉంది. కోవిడ్1, కోవిడ్ 2 దశల్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని చవిచూసింది. వరుస లాక్ డౌన్ లతో లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. దీనివల్ల అనేక దేశాల ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కనిపిస్తోంది అంటే అందుకు కారణం కోవిడ్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకీ అక్కడ పరిస్థితి మరింత దిగజారిపోతున్నది. వివిధ దేశాల వైద్య నిపుణుల అంచనా ప్రకారం అక్కడ సామాజిక వ్యాప్తి మొదలైనట్టు తెలుస్తోంది.

మరిన్ని వేవ్ లు
ప్రస్తుతం చైనాలో ఒమీక్రాన్ బీఎఫ్. 7 వేరియంట్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.. లక్షలాదిమంది ఈ వైరస్ బారిన పడ్డారు.. వైరస్ ఉధృతి వల్ల పాజిటివ్ రేటు అంతకంతకూ పెరుగుతోంది.. వృద్ధులైతే నరకం చూస్తున్నారు. ఆసుపత్రులలో బెడ్లు దొరకక గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నది. చైనాలో వైరస్ ఉధృతి కి కారణాలుగా కోవిడ్ ఆంక్షలు సడలింపు, అక్కడ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ లేకపోవడం, వ్యాక్సిన్ లో అంత నాణ్యత లేకపోవడం గా తేల్చింది. ఇప్పటికే ఒమిక్రాన్ కు చెందిన 500 ఉప రకాలు వ్యాప్తి లో ఉన్నాయని స్పష్టం చేసింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే తీవ్రమైన పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటాయి
ఒమిక్రాన్ లో కొన్ని ఉపరకాలకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఉన్నాయి. అయితే వీటి పై పోరాడేందుకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవటం ఉపశమనం కలిగించే విషయం. అంతేకాదు కోవిడ్ ప్రభావం తగ్గిన తీరుని కూడా చూసాం.. ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరడమే ఇందుకు కారణం.. ప్రస్తుతం చైనా తో పాటు ఇతర దేశాల్లో వృద్ధులు, రోగనిరోధకత తక్కువగా ఉండే వారితో పాటు ముక్కో అధికంగా ఉండే ఫ్రెంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.

అయితే, ప్రస్తుతం చైనాలో కరోనా ఉధృతి పెరుగుతున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తున్నది. వ్యాక్సినేషన్ లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం చైనా చేసిన అతి పెద్ద తప్పు. పైగా ఆ వ్యాక్సిన్ ఎలా రూపొందించారు అనేది ఇప్పటికీ చిదంబర రహస్యమే. పైగా మొన్నటిదాకా జీరో కోవిడ్ పాలసీ అమలు చేసిన ఆ దేశం.. ఇప్పుడు ఆంక్షలు మొత్తం సడలించడంతో పరిస్థితి దారుణంగా తయారయింది. ఇది ఏ పరిణామానికి దారితీస్తుందో తెలియదు కానీ… ఇప్పుడైతే చైనాలో పరిస్థితి అసలు బాగోలేదు.