CM Jagan: సహజంగా నేతలు తమ రాజకీయ వారసులను తెరపైకి తెస్తుంటారు. కరెక్ట్ టైములో వారికి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చివారి భవిష్యత్ ను నాలుగు కాలల పాటు నిలబడేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఏపీలో వైసీపీ నేతలకు మాత్రం ఆ చాన్స్ లేదు. చేస్తే మీరే పోటీచేయండి.. లేకపోతే మరొకరికి చాన్స్ ఇస్తానంటూ జగన్ చెబుతుండడంతో వారికి బెంగ పట్టుకుంది. ఎవరైనా యంగ్ స్టార్స్ ను కోరుకుంటారు కానీ.. జగన్ మాత్రం సీనియర్లే కొనసాగాలని ఆదేశాలిస్తుండడం వారికి మింగుడుపడడం లేదు. మీరు సీనియర్లమని భావించి తప్పుకుంటే.. మరొకరికి రాజకీయంగా చాన్సిస్తామని అధినేత చెబుతుండడంతో వారు పునరాలోచనలో పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ లు సీనియర్లు. ముగ్గురుకీ ఆరు పదుల వయసు దాటింది. దీంతో వారు తప్పుకొని వారసులకు లైన్ క్లీయర్ చేయాలని చూస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవినాగ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో తండ్రి గెలుపునకు కృషిచేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అదే మాటను స్పీకర్ తమ్మినేని జగన్ చెవిట్లో వేశారు. దీంతో అంతే స్పీడుగా జగన్ రిప్లయ్ ఇచ్చేసరికి తమ్మినేనికి షాక్ తగిలింది. ఆమదాలవలసలో తమ్మినేనికి అసమ్మతి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతోంది. జగన్ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చేస్తే మీరు చేయండి లేకుండా పోటీచేయడానికి ప్రత్యామ్నాయ నాయకత్వం ఉందంటూ చెప్పడంతో షాక్ తినడం తమ్మినేని వంతైంది.
మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ‘సన్’ స్ట్రోక్ తప్పడం లేదు. చాలా సందర్భాల్లో ప్రసాదరావు పొలిటికల్ రిటైర్మెంట్ పై కామెంట్స్ చేస్తూ వచ్చారు. గత కొన్నేళ్లుగా ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు తెర వెనుక సేవలందిస్తున్నారు. అయితే తాను తప్పుకొని కుమారుడికి ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను ధర్మాన కోరారు. అందుకు అధినేత ఒప్పుకోనట్టు తెలుస్తోంది. మీరైతే నెట్టుకురాగలరని.. మీ కుమారుడికి టిక్కెట్ ఇస్తే ఆ నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పడంతో ధర్మాన నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రామ్ మనోహర్ నాయుడు వ్యవహార శైలితో మైనస్ ఉండడం వల్లే జగన్ అలా స్పందించారి అంతా భావిస్తున్నారు.

మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కూడా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు చాలాసార్లు ప్రకటించారు. తన రాజకీయ వారసుడు ధర్మాన కృష్ణ చైతన్య పేరును ప్రకటించారు. అటు సొంత మండలం జడ్పీటీసీగా కూడా గెలిపించుకున్నారు. కృష్ణ చైతన్య అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఎప్పడైతే క్రిష్ణదాస్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన తరువాత.. ధర్మాన కుటుంబం నుంచి అభ్యర్థనలు వెళ్లాయి. క్రిష్ణదాస్ మేనల్లుడు, సారవకోట ఎంపీపీ తనను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీంతో పంచాయితీ జగన్ వద్దకు చేరుకుంది. వారసులకు నోచాన్స్.. చేస్తేమీరు చేయండి..లేకుంటే తప్పుకోండి అంటూ అల్టిమేటం జారీచేయడంతో సిక్కోలు కు చెంది ముగ్గురు నేతలు సైలెంట్ అయిపోయారు.