Pooja Hegde: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా లేక స్ట్రెయిట్ మూవీనా? అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. టైటిల్ మార్చారే కానీ ఇది ‘తేరీ’ రీమేకే అంటున్నారు. ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తేరీ రీమేక్ కి సమూల మార్పులు చేసి ఉస్తాద్ భగత్ సింగ్ గా తెరకెక్కిస్తున్నారట. గతంలో హరీష్ ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ పక్కన పెట్టారట. ఇది ఒక వాదన.

ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు… పూర్తిగా కొత్త స్టోరీ అనేది మరొక వాదన. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. కథ ఏదైనా పవన్ స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. రికార్డులు బద్దలవుతాయి. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. గతంలో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ చిత్ర హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారు. ఇప్పుడు కూడా ఆమెను తీసుకోవాలి అనేది దర్శకుడు హరీష్ ఆలోచన.
ఎందుకంటే పూజా హెగ్డే హరీష్ శంకర్ ఫేవరెట్ హీరోయిన్ గా ఉన్నారు. హరీష్ తెరకెక్కించిన డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో పూజా హెగ్డే నటించారు. అందులోనూ పవన్ తో పూజా హెగ్డే ఇంత వరకూ నటించలేదు. పూజాను తీసుకుంటే ఓ ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. అయితే పూజా హెగ్డేను తీసుకోవడంలో కొత్త చిక్కులు ఉన్నాయనేది చిత్ర వర్గాల అంచనా. కారణం… పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్స్ ఒక ప్రణాళిక ప్రకారం ఉండదు.

పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ ఆధారంగా అవి మారుతూ ఉంటాయి. మేకర్స్ ఈ నిబంధనలకు లోబడే పవన్ తో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా బిజీ షెడ్యూల్స్ కలిగిన పూజా హెగ్డే డేట్స్ కేటాయించినప్పటికీ… భవిష్యత్ లో తలెత్తే మార్పులు చేర్పుల వలన ఇబ్బందులు రావచ్చు. అటు పూజా హెగ్డే ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్ కి సమస్యలు తలెత్తే సూచనలు కలవు. ఈ క్రమంలో పూజాను తీసుకోకపోవడమే మంచిదని యూనిట్ భావిస్తున్నారట.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కొత్త హీరోయిన్ ని తీసుకునే ఆస్కారం కలదనేది మరొక అంచనా. మరి చూడాలి పవర్ స్టార్ తో జతకట్టే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు పవన్ హరి హర వీరమల్లు, సుజీత్ చిత్రాలు చేస్తున్నారు. హరి హర వీరమల్లు షూట్ త్వరలో పూర్తి కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.