NIMS Hospital Thoracic kidney: ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వాడు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజలు ఎన్నుకున్న వారు. ఏ రకంగా చూసుకున్నా ప్రజాప్రతినిధులు పాలనపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిఢవిల్లేలా చేయాలి. కానీ జ్వరం వస్తే యశోదకు, కంటి నొప్పి వస్తే ఏయిమ్స్ కు, పంటి నొప్పి వస్తే ఢిల్లీకి స్పెషల్ ఫ్లయిట్ లో పోకూడదు. ఎలాగూ ఎదురు లేదు. అడిగే దిక్కు లేదు. మనల్ని ఎవర్రా ఆపేది అన్నప్పుడే కాలం తనదయిన రీతిలో సమాధానం చెపుతుంది. అప్పుడు మనం ఘనంగా చెప్పే భగీరథ, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కాళేశ్వరం, ఐటీ హబ్ లు ఎందుకూ పనికిరాకుండా పోతాయి. ప్రతిపక్షాలను కొన్నంత మాత్రానా, ధర్నా చౌక్ లను ఎత్తేసినంత మాత్రానా నిజాలు అబద్ధాలు అయిపోవు. వ్యవస్థకు అధిపతి అయిన నాయకుడు వ్యవస్థ కు వ్యతిరేకంగా వెళ్లి మిగతా వాళ్ళను వ్యవస్థలో బతకాలి అంటేనే ఎక్కడో కాలుద్ది. చిన్నపాటి చేయి వణుకుకే యశోద లో నానా యాగీ చేసిన నాయకుడికి చెంప పెట్టులా, జ్వరం వచ్చినా ఆపోలో లోనే రోజుల పాటు ఉన్న ఎమ్మెల్యేలకి చర్నా కోలు దెబ్బల్లా నిన్న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు మహబూబ్ నగర్ యువకుడికి చేసిన అరుదయిన శస్త్ర చికిత్సలు వైద్య రంగంలోనే సరి అధ్యాయం. సర్కారీ ఆసుపత్రులు అంటేనే కంపు కొట్టే మూత్ర శాలలు, ఉపయోగపడని మరుగు దొడ్లు, వేళకు రాని డాక్టర్లు, పట్టించుకోని సిబ్బంది అనే ఏళ్లనాటి మాటలకి సరయిన సమాధానం. ఇంతకీ ఆ నిమ్స్ డాక్టర్లు ఏం చేశారంటే .
పునర్జ న్మ ప్రసాదించారు
అతడి శరీరంలో మూత్రపిండం ఉండాల్సిన చోటులో లేదు. అత్యంత సున్నితమైన గుండెకు, ఊపిరితిత్తులకి మధ్య ఉంది. ఉన్నా బాగుందా అంటే అదీ లేదు. ఆ మూత్ర పిండంలో రాళ్లు ఉన్నాయి.అవి కూడా 4.5 ఎం ఎం సైజులో.. ఇవి చాలవన్నట్టు మూత్ర పిండం నుంచి మూత్రాశయానికి వెళ్ళే యూరేటర్ ట్యూబ్ లో గతంలో వేసిన స్టంట్ విరిగిపోయింది. ఆ మూత్ర పిండం లో రాళ్ళు తీయాలి అంటే శస్త్ర చికిత్స చేయాలి. అదే గనుక చేస్తే ఊపిరి తిత్తులకు ప్రమాదం. ఈ ముప్పును తప్పించాలి అంటే ఊపిరి తిత్తుల్లో ఒక్క దానిని పని చేయకుండా ఆపాలి. ఈ ప్రక్రియలో ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణానికే ప్రమాదం. ఇంతటి సంక్లిష్టమైన కేసు కాబట్టే ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేయబోమని తేల్చి చెప్పేశాయి. కానీ ఈ కేసును నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు సవాల్ గా తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రులకు సవాల్ విసిరారు. అంతేనా విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. ₹ లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ను ఆరోగ్య శ్రీ కింద పూర్తి ఉచితంగా చేశారు.
Also Read: Janasena TDP Alliance : ఏది ముఖ్యం.? ముఖ్యమంత్రి కావడమా? జగన్ ను సీఎం కుర్చీలోంచి దించడమా?
ఇంతకీ ఆ కేసు ఏంటంటే
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 22 సంవత్సరాల యువకుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. ఎటువంటి అలవాట్లు లేవు. కానీ అకస్మాత్తుగా మూత్రంలో మంట, జ్వరం, నడుం నొప్పితో బాధపడుతూ కిందటి నెలలో నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అతడికి టెస్టులు చేసిన వైద్యులు విస్తుపోయారు. అతడి శరీరంలో ఎడమ మూత్రపిండం ఉండాల్సిన స్థానంలో లేదు.. అది ఛాతీ భాగంలో ఉంది. ఆ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించారు. మూడేళ్ల క్రితం.. అతడి మూత్రపిండం నుంచి మూత్రాశయానికి వెళ్లే నాళంలో రాళ్లు ఏర్పడితే వాటిని తొలగించే క్రమంలో వైద్యులు స్టెంట్ వేశారు. సాధారణంగా అలాంటి స్టెంట్‌లు వేసినప్పుడు మూడువారాల తర్వాత వాటిని తొలగిస్తారు. కానీ, అప్పట్లో వైద్యులు ఆ స్టెంట్‌ను తొలగించలేదు. మళ్లీ ఇప్పుడు అతడి కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో.. అతడు పలు ఆస్పత్రులకు వెళ్లాడు. వెళ్లిన ప్రతిచోటా వైద్యులకు అతడి సమస్య ఎంత క్లిష్టమైనదో అర్థమై శస్త్రచికిత్స చేయడానికి ముందుకు రాలేదు.
చివరి ఆశగా నిమ్స్ కు వెళ్ళాడు
దీంతో అతడు నిమ్స్ వైద్యులను ఆశ్రయించాడు. నిమ్స్‌లోని యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్ సారథ్యంలోని వైద్య బృందం దీన్ని ఒక సవాల్‌గా తీసుకుని టెస్టులు చేశారు. తొలగించకుండా ఉన్న స్టెంట్ ఎడమవైపు కిడ్నీ పై భాగంలో విరిగిపోయింది. ఆ ప్రాంతంలో రాళ్లు ఏర్పడ్డాయి. వాటిని తొలగించడానికి వారు సింగిల్ లంగ్ వెంటిలేషన్ ద్వారా వ్యాట్స్ (వీడియో అసిస్టెడ్ థోరోస్కోపిక్ సర్జరీ) విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు. సింగిల్ లంగ్ వెంటిలేషన్ అంటే రెండింటిలో కిడ్నీవైపు ఉన్న ఎడమ ఊపిరితిత్తిని తాత్కాలికంగా పనిచేయకుండా నిలిపివేశారు. అనంతరం ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఒక రంధ్రం చేసి ఎడమ కిడ్నీలో ఉన్న రాయిని, అలాగే స్టెంట్‌ను తొలగించారు. ఇందుకు దాదాపు రెండు గంటలు పట్టింది. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స నిర్వహించిన బృందంలో నిమ్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్ రాంరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్ కీలకపాత్ర పోషించారు. డాక్టర్ రంగనాథ్, డాక్టర్ నిర్మల, డాక్టర్ ధీరజ్ తమ వంతు సాయం చేశారు.
కోటి మందిలో ఒకరికి
అత్యంత అరుదైన శస్త్రచికిత్స ఇది. ఛాతీ భాగంలో కిడ్నీ ఉండటం అత్యంత అరుదైన విషయం. ఆ యువకుడికి జన్మతహ అలాగే ఉంది. ఇలా ఉండటం కోటి మందిలో ఒక్కరికి కూడా ఉండకపోవచ్చు. నిమ్స్‌లో ఏటా ఆరున్నరవేల సర్జరీలు చేస్తారు . కానీ ఈ తరహా కేసు ఇదే మొదటిసారి. కిడ్నీ అలా ఉండటం ఒకెత్తు అయితే… అంత చిన్న వయసులో కిడ్నీలో రాళ్లు ఉండటం మరో అరుదైన విషయం. ఈ సమస్యకు చికిత్సను వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన సర్జరీ చేశారు. ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే ఈ సర్జరీకి రూ.లక్షలు ఖర్చయ్యేది. దీన్ని నిమ్స్ వైద్యులు ఆరోగ్యశ్రీలో పూర్తి ఉచితంగా చేశారు.
అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. తీరా జరిగాక ఎవరూ పట్టించుకోరు. ఖలేజా లో త్రివిక్రమ్ డైలాగ్ ఇది. మరి నిమ్స్ వైద్యులు చేసిన అద్భుతాన్ని కేసీఆర్ పట్టించుకుంటారా? కేసీఆర్ నమ్మకున్నా, ఎమ్మెల్యేలు ఇష్ట పడకున్నా ఈ నాలుగు కోట్ల తెలంగాణ వాసుల్లో 90 శాతం మందికి ఆ సర్కారు దవాఖానలే దిక్కు.