AP Kapu Politics: ఆంధ్రా పాలిటిక్స్ ఇప్పుడు కాపుల చుట్టూ తిరుగుతోంది. కాపు అసోసియేషన్లు యాక్టివ్ అవుతున్నాయి. ఈ నెల 26న వంగవీటి మోహన్ రంగా వర్థంతిని పురస్కరించుకొని విశాఖలో కాపునాడు పేరిట భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. రంగా,రాధా రాయల్ అసోసియేషన్ పేరిట నిర్వహిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లీడ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోస్టర్ ను గంటా ఆవిష్కరించారు.పోస్టర్ పై వంగవీటి మోహన్ రంగా ఫొటోతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫొటోలను ముద్రించారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ కాపు నేతలు వస్తారా? లేదా? అన్నది సస్పెన్షే. కార్యక్రమానికి అన్ని పార్టీల్లో ఉన్న కాపునేతలను ఆహ్వానిస్తున్నారు. అటు వంగవీటి వారసుడు రాధా హాజరుకానున్నారు. దాదాపు 50 వేల మంది హాజరవుతారని అంచనా వేసి విశాఖ ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే కాపునాడు సమావేశం పక్కా పొలిటికల్ అజెండాతో సాగుతోందని వార్తలు వస్తున్నాయి. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చూస్తున్నారు. ఆయన వరుసగా టీడీపీ కాపు నేతలతో సమావేశమవుతున్నారు. వారిని ప్రత్యేకంగా కలుస్తుండడం, పవన్, చిరంజీవి ఫొటోలు ప్రచురించడంతో అసలు వైసీపీ నేతలు వస్తారా? అన్నది ప్రశ్న. ఇప్పటికే చాలా సందర్భాల్లో పవన్ వైసీపీ కాపు మంత్రులు, నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అటు వైసీపీ కాపు నాయకులు సైతం పవన్ పై అదే స్థాయిలో రియాక్టయ్యారు. జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు గుప్పించిన ప్రతిసారి కాపు నాయకులే తెరపైకి వస్తున్నారు. వారితోనే వైసీపీ హైకమాండ్ పవన్ ను తిట్టిస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో కాపునాడు సమావేశానికి అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. పొలిటికల్ గా ఈ సమావేశం కాపులకు ఎటువంటి మెసేజ్ పంపుతుందా అన్న ఉత్కంఠ మాత్రం సర్వత్రా ఉంది.

అయితే కాపునాడు సమావేశానికి ఒక రోజు ముందు తూర్పుకాపుల పిక్నిక్ అనకాపల్లిలో నిర్వహించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు నిర్ణయించారు. అయితే ఇది యాదృశ్చికంగా జరిగిందా? లేక కాపునాడుకు దీటుగా వైసీపీ నేతలు పురమాయించి ఏర్పాటుచేశారా?అన్న చర్చ అయితే నడుస్తోంది. పిక్నిక్ కు మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు,కరణం ధర్మశ్రీతో పాటు ఉత్తరాంధ్రలోని కాపు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, కళా వెంకటరావుతో పాటు కాపు నాయకులందరికీ ఆహ్వానాలు అందాయి. ఒక రోజు వ్యవధిలోనే కాపులకు సంబంధించి రెండు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో దీనికి రాజకీయరంగు పులముకుంది. అయితే నేతల హాజరుబట్టి అంచనాలు, విశ్లేషణలు పెరిగే అవకాశముంది. ఒక విధంగా చెప్పాలంటే ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా జరిగే కాపునాడు మీటింగ్ పైనే ఫోకస్ అయి ఉంది,