Minister Gudivada Amarnath: అవగాహన లేకో.. లేకుంటే అహంకారంతో మాట్లాడతారో తెలియదు కానీ కొందరు నేతలు కన్ఫ్యూజ్ తో మాట్లాడి నవ్వులపాలవుతుంటారు. తెలిసీ తెలియని మాటలతో తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. తెలివైన ప్రజల ముందు అబాసుపాలవుతుంటారు. ఇటువంటి నేతల్లో ఏపీ మంత్రులే ఎక్కువ. తమ శాఖల ప్రగతి గురించి చెప్పినా.. రాజకీయ కామెంట్స్ చేసినా ఎక్కడో ఓ చోట దొరికిపోతుంటారు. అటువంటి వారిలో ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. మొన్న ఆ మధ్య పవన్ తో దిగిన ఫొటో చూపించి.. తనతోనే పవన్ ఫొటో దిగేందుకు ఎగబడ్డారని చెప్పి తెలుగు ప్రజలకు గొప్ప వినోదం పంచారు. ఇప్పుడు తాజాగా తన శాఖలో ప్రగతి గురించి తెలియజెప్పే క్రమంలో అవగాహన లేకుండా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియా విపరీత చర్చకు కారణమయ్యారు.

ఇటీవల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్న ఒక విమర్శ ఉంది. పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రిగా ఫెయిలయ్యారన్న ఆరోపణలున్నాయి. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీకి ఆహ్వానం అందలేదన్న వార్తలు వచ్చాయి. ఆహ్వానం అందినా ఏపీ నుంచి మంత్రి కానీ.. ఆ శాఖ అధికారులు వెళ్లలేదన్న కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. సహేతుకంగా లేని కొన్ని కారణాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రితో పాటు జగన్ సర్కారును ఇరుకున పెడుతున్నాయి.
దావోస్ సదస్సు కు హాజరుకాకపోవడం గురించి అమర్నాథ్ స్పందించారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దావోస్‌లో మైనస్ ఐదు డిగ్రీల చలి ఉంటుంది.. మా ఆరోగ్యాలు ఏం కావాలి ? ఈ చలిలో అక్కడకు వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ స్నానాలు చేయరు. మేము వారిలో ఎలా తిరగగలం ? అసలు దావోస్ కు మనం వెళ్లడం ఎందుకు.. మన దగ్గరకే దావోస్ వస్తుంది ? . అసలు ఐటీ పరిశ్రమలు ఎందుకు.. ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం ఎందుకు… ఎక్కడ చూసినా ఐటీ సంస్థల్లో తెలుగువాళ్లే పని చేస్తున్నారు ? కదా అని మంత్రి చేసిన కామెంట్స్ చేశారు. చలి, స్నానం, చన్నీరు అంటూ చిన్నపిల్లాడి మాదిరిగా చెప్పుకొచ్చారు.ఆయనకు ఏమీ తెలియదని.. అమాయకత్వంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని అర్ధమవుతుంది.

అమర్నాథ్ మామ్మూలు వైసీపీనేతనంటే ఓ పట్టాన ఒప్పుకునే వ్యక్తి కాదు. తనకు తాను బలమైన నేతగా, అధినేత తర్వాత తానే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. పైగా ఐటీ, ‘భారీ’ పరిశ్రమల శాఖ మంత్రి. అటువంటి వ్యక్తి ఎంత బాధ్యతతో మాట్లాడాలి. పారిశ్రామిక ప్రపంచానికి ఒక మంత్రిగా పంపించే సందేశమదేనా? అని విపక్షాలు ఏకిపారేస్తున్నాయి. నెటిజెన్లు సైతం మండిపడుతున్నారు. హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. మంత్రిగా పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతుండడం వ్యక్తిగతంగా ఆయనకు నష్టం జరుగుతుందన్న మాట అటుంచితే.. రాష్ట్రానికి అంతులేని నష్టం జరుగుతోంది. ఆయనకు ఏమీ తెలియదని.. అమాయకత్వంతో ఇటువంటి వ్యాఖ్యాలుచేసి ఉంటారని భావించడం… అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు.