
Narayana- CID: ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతల టార్గెట్ గా పోలీసులు, దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న అధికార పార్టీ మాజీ మంత్రి నారాయణను బుక్ చేయడానికి చేయని ప్రయత్నం లేదు. వివిధ ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు నారాయణ సీఐడీ కి చిక్కినట్లు తెలుస్తోంది. తాజా సోదాల్లో నివాసంలో కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది.
మూడు రోజులుగా సోదాలు..
ఏపీ సీఐడీ అధికారులు మూడు రోజులుగా నారాయణతో పాటుగా ఆయన కుమార్తెల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అమరావతి భూ లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని అయిదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సోదాల సమయంలో సీఐడీకి కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది. అందులో కీలకమైన సమాచారం ఉందని.. దీని ఆధారంగా తదుపరి నిర్ణయాల దిశగా సీఐడీ అడుగులు వేయనున్నట్లు సమాచారం.
అమరావతి వ్యవహారాల్లో ఆయనే కీలకం..
మాజీ మంత్రి నారాయణ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమారావతి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. నాడు మున్సిపల్ మంత్రిగా అమరావతి మాస్టర్ ప్లాన్.. భూ సమీకరణలో కీలకంగా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతిలో భూ స్కాం జరిగిందని ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారం పైన మంత్రివర్గ ఉప సంఘం నియమించింది.
రాజధాని ప్రకటనకు ముందే భూ దందా..
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేసి.. ప్రకటనకు ముందే నారాయణ తమ అనుచరులకు మేలు చేసేలా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ. ఇదే కేసుకు సంబంధించి గతంలో సీఐడీ మాజీ మంత్రి నారాయణను విచారించింది. ఈ కేసు కోర్టుకు చేరింది. ఇప్పుడు సీఐడీ నారాయణతోపాటు ఆయన కుమార్తెలకు ఇందులో ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా సోదాలు కొనసాగతున్నాయనీ తెలుస్తోంది.
సీఐడీ చేతికి కీలక ఆధారాలు?
తాజా తనిఖీల్లో అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో సోదాల్లో భాగంగా సీఐడీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో భాగంగా ఒక ఆడియో క్లిప్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మొత్తం వ్యవహారంలో ఇది కీలకమైనదిగా చెబుతున్నారు. అందులో మాజీ మంత్రి నారాయణ..ఆయన కుమార్తె మధ్య జరిగిన సంభాషణలో ముఖ్యమైన సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ ఆదియోలో మనీ రూటింగ్‌కి సంబంధించి నారాయణ స్పష్టత ఇచ్చారని సమాచారం. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించారని.. ఈ ఆధారాలు ఇప్పుడు సీఐడీకి చిక్కాయని విశ్వసనీయ సమాచారం. ఆ ప్రకారమే మనీ రూటింగ్ చేయటం.. తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
సీఐడీ చర్యలపై ఉత్కంఠ..
మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు గతంలోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో మంత్రి నారాయణ నివాసాలపై కూడా సీఐడీ అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు నారాయణ కుమార్తె నివాసంలోనూ సోదాలు చేశారు. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయనే అభియోగాలతో సాగుతున్న ఈ సోదాల్లో ఇప్పుడు లభించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ తో సీఐడీ తదుపరి అడుగులు ఏ విధంగా ఉండనున్నాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మొత్తంగా నారాయణను జైలుకు పంపాలని లక్ష్యం తాజా సీఐడీ సోదాలతో నెరవేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రశ్న పత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్ట్ చేసినప్పటికీ కోర్టు అరెస్టును తప్పుపట్టింది. బెయిల్ మంజూరు చేసింది. దీంతో అమరావతి కేసులో నారాయణను పక్కా ఆధారాలతో బుక్ చేయాలన్న అధికార వైసీపీ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపిస్తోంది.