
Nara Lokesh- Kethireddy: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాగా పాపులర్ అయ్యారు. రాష్ట్రంలో ఆయన గురించి తెలియని వారు ఉండరు. అటువంటి ఎమ్మెల్యే గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ధర్మవరంలో పాదయాత్ర సాగిస్తున్న ఆయన.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్ గుట్టు బయటి ప్రపంచానికి డ్రోన్ వీడియో రూపంలో చూపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో జోరుగా పాదయాత్రను సాగిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రతి ప్రాంతంలోనూ తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, ప్రస్తుత వైసిపి పాలనలో దుర్గతిలో ఉన్న అనేక అంశాలను సెల్ఫీ రూపంలో ఫోటోలు తీస్తూ బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతంలో యాత్ర సాగింది. ఈ సందర్భంగా లోకేష్ తో పాటు యాత్రలో పాల్గొన్న స్థానిక నాయకులు ఆ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి ముచ్చటపడి కట్టుకున్న ఫామ్ హౌస్ గురించి చెప్పారు. దీంతో వెంటనే లోకేష్ దానిని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో ఆ ఫామ్ హౌస్ ను వీడియో రూపంలో బయట ప్రపంచానికి విడుదల చేశారు.
నెట్టింట చక్కెర్లు కొడుతున్న ఫామ్ హౌస్ వీడియో..
నారా లోకేష్ విడుదల చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ తో పాటు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ వీడియోను పదేపదే చూపిస్తున్నారు. దీంతో వేలాదిగా ఆ వీడియోను చూస్తున్నారు. ఆ వీడియోని చూస్తున్న ఎంతోమంది వీక్షకులు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిది మంచి టేస్ట్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, అడ్డగోలుగా ఆక్రమించుకొని దొబ్బాడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వరదలు వస్తే ఫామ్ హౌస్ పరిస్థితి ఏమిటో మరి కొంతమంది చలోక్తులు విసురుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఎమ్మెల్యే ఫామ్ హౌస్ హాట్ టాపిక్ గా మారింది.
కబ్జా చేసి కట్టుకున్న ఫామ్ హౌస్ అంటూ..
నారా లోకేష్ వీడియో రూపంలో విడుదల చేసిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫామ్ హౌస్ ధర్మవరం సమీపంలోని ఎర్రగుంట పై నిర్మించారు. చుట్టూ నీళ్లు.. పక్కన పచ్చని చెట్ల మధ్య ఫార్మ్ హౌస్.. ఆ ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు చదును చేసిన భూమి గుండా దారి. ఈ ఫామ్ హౌస్ వీడియోని తీర్చేసిన నారా లోకేష్ .. కబ్జాల కేతిరెడ్డి ఫామ్ హౌస్ ఇదేనంటూ బయటికి వెల్లడించారు. కేతిరెడ్డి ఆక్రమణలను అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళగక్కించి ప్రజలకు పంచుతామని లోకేష్ స్పష్టం చేశారు. ఆక్రమణలు, కబ్జాలు చేసి తమ ముచ్చట తీర్చుకుంటున్నారని, బయటికి మాత్రం తాను పెద్ద నీతిపరుడిలా వ్యాఖ్యలు చేస్తుంటారని ఎమ్మెల్యే గురించి లోకేష్ విమర్శలు గుప్పించారు.

ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి..
తన ఫామ్ హౌస్ గురించి వీడియో విడుదల చేసి.. కబ్జా ఆరోపణలు చేసిన లోకేష్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఘాటుగానే స్పందించారు. తాను రైతులు వద్ద కొనుగోలు చేసి కట్టుకున్న ఫామ్ హౌస్ అని, అందులో ఆక్రమణలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తాను కట్టుకున్న ఫామ్ హౌస్ గురించి తర్వాత చెబుదువు గాని.. ముందు మీ నాన్న కృష్ణా నది కరకట్ట మీద కట్టిన ఫామ్ హౌస్ లెక్క చెప్పాలంటూ ఓ సెల్ఫీ వీడియోని విడుదల చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. కృష్ణానది వరదలు ముంచెత్తకుండా కట్టిన కరకట్ట మీద నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారో చెప్పాలని లోకేష్ ను ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట గుట్టు విప్పి.. ఎదుటి వారిపై విమర్శలు చేయాలని కేతిరెడ్డి స్పష్టం చేశారు.