
Producer Naveen Yerneni టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ పై మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అధికారుల దాడుల్లో కీలక విషయాలు బహిర్గతం అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నేడు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని అనారోగ్యానికి గురి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనారోగ్య సమస్యలతో నవీన్ ఎర్నేని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. సడన్ గా నవీన్ ఎర్నేని అనారోగ్యం బారిన పడటం వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది.
గత మూడు రోజులు, ఐటీ, ఈడీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ సినిమాలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాక్స్ లు కూడా సక్రమంగా చెల్లించడం లేదనేది అధికారుల ఆరోపణగా తెలుస్తుంది. విదేశాల నుండి పెద్ద మొత్తంలో మైత్రి మూవీ మేకర్స్ డబ్బులు తీసుకొస్తున్నారని, రాజకీయ వేత్తలు తమ అక్రమ సంపాదన వీరి ద్వారా సినిమాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారనే వాదన కూడా ఉంది.
సోదాల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సినిమాల్లో వచ్చిన లాభాలతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పరిశ్రమ ప్రాంతాల్లో స్థలాలు కొన్నట్లు డాక్యుమెంట్స్ లభించాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న సుకుమార్ మీద కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. మూడు రోజులుగా ఆయన ఇల్లు, కార్యాలయాలను సోదా చేస్తున్నారు. సుకుమార్ సైతం స్థలాల మీద కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది.

సుకుమార్ గత రెండు చిత్రాలు రంగస్థలం, పుష్ప మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కాయి. మూడో చిత్రం పుష్ప 2 సైతం వారే నిర్మిస్తున్నారు. 2015లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ అనతికాలంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అవతరించింది. పుష్ప 2తో పాటు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ మూవీ. విజయ్ దేవరకొండతో ఖుషి చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ 31, రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాలను ప్రకటించారు. ఒక్కో ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 200 కోట్లకు పైమాటే. ఈ సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విజయాలు సాధించాయి.