Mysterious Places: ఒక్కో నిర్మాణం.. ఒక్కో అద్భుతం. వాటిని చూస్తే ఆశ్చర్యానికి గురవుతాం. వందల సంవత్సరాలవుతున్నప్పటికి.. నిర్మాణ విషయంలో ఇప్పటికీ అలానే కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించినప్పటికీ నేటికీ అవి దృఢంగానే కనిపిస్తున్నాయి. వాటి నిర్మాణం వెనుక అంతుచిక్కని రహస్యాలను చేదించేందుకు చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేశారు. దాని వెనుక ఎలాంటి మర్మం దాగుందో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
అజంతా ఎల్లోరా గుహలు
అజంతా ఎల్లోరా గుహలు మహారాష్ట్రకు కంఠాభరణం లాంటివి. వీటికి నాలుగువేల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గుహల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అజంతాలో 30 గుహలు, ఎల్లోరాలో 12 గుహలున్నాయి. ఒక్కో శిల కింద ఒక్కోనగరం ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహలను పర్వతాన్ని తొలిచి నిర్మించారని అంటుంటారు.
భాంగర్ కోట
రాజస్థాన్ లోని భాంగర్ కోట కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. రాజస్థాన్ అంటేనే కోటలకు ప్రసిద్ధి. భాంగర్ కోట వాటన్నింటికంటే చాలా ప్రత్యేకం. ఇది రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోట చరిత్ర వెనుక అనేక కథలు దాగి ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఆ కథల్లో దయ్యాల నేపథ్యం ముడిపడి ఉందని అంటుంటారు. ఈ కోటను 17 వ శతాబ్దంలో నిర్మించారని.. నేటికీ ఇక్కడ దయ్యాలు, పిశాచాలు సంచరిస్తుంటాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఆ కోట పరిసర ప్రాంతాల్లోకి రాత్రిపూట వెళ్లేందుకు ప్రజలు జంకుతుంటారు.

రూప్ కుండ్ సరస్సు
ఉత్తరాఖండ్ రాష్ట్రం సరస్సులకు పుట్టినిల్లు. ఈ రాష్ట్రంలో రూప్ కుండ్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇది భూమి నుంచి 5,029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ అస్థిపంజరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది నేటికీ అంతు చిక్కడం లేదు. గతంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు లేదా ఇతర ఘాతుకాలు జరిగాయా? అనే కోణంలో చరిత్రకారులు పరిశోధనలు జరిపినప్పటికీ దాని వెనుక నిజమేమిటో బయటి ప్రపంచానికి తెలియలేదు.

లేపాక్షి ఆలయం
అద్భుతమైన శిల్ప కళకు నెలవైన లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో 70 స్తంభాలు నిర్మించారు. ఇక్కడ ఉండే ఒక స్తంభం పై కప్పు సహాయంతో గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఇది ఎందుకు వేలాడుతుంది? దాని నిర్మాణంలో ఎలాంటి పద్ధతి అవలంబించారు? ఈ రహస్యాలను ఇంతవరకు ఎవరూ బయట పెట్టలేకపోయారు.
