Mysore Shree: ఈ దాడి తర్వాత భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాద దేశంలో టెర్రరిస్టుల స్థావరాలను నేలకూల్చింది. తద్వారా దాయాదికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ అంటే మన దేశ ప్రజలు ఒంటి కాలి మీద లేస్తున్నారు. ఆ పేరు వినిపిస్తే చాలు చిరాకు పడుతున్నారు. పాకిస్తాన్ జాతీయ జెండాలను నడివీధిలో ఉంచి.. కాళ్లతో తొక్కి నిరసన తెలుపుతున్నారు. చివరికి పాకిస్తాన్లో ప్రధాన నగరమైన కరాచీ పేరుతో మన దేశంలో బేకరీలను కొనసాగిస్తున్న వారిపై కూడా నిరసనలకు పాల్పడ్డారు. హైదరాబాదులో కరాచీ పేరుతో ఉన్న బేకరీలపై దాడులు కూడా చేశారు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరికి కరాచీ పేరుతో బేకరీలో నిర్వహిస్తున్న వ్యక్తి హిందూ కుటుంబానికి చెందిన వాడని తెలియడంతో ఆందోళనకారులు శాంతించారు.
ఇక ఇప్పుడు రాజస్థాన్లోని జైపూర్లో ఓ మిఠాయి దుకాణం యజమాని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన దుకాణంలో విక్రయించే మిఠాయిల పేర్లు మార్చేశాడు. మైసూర్ “పాక్” తో సహా చాలా మిఠాయిల పేర్లను అతడు మార్చేశాడు.. తర్దుకాలలో విక్రయిస్తున్న మిఠాయిల పేర్లలో చివర పాక్ అనే ఉంది. దీంతో వాటి పేర్లను ఆ వ్యాపారి పూర్తిగా మార్చేశాడు. మైసూర్ పాక్ ను మైసూర్ శ్రీ, మోతీ పాక్ ను మోతి శ్రీ అని, గోండ్ పాక్ ను గోన్డ్ శ్రీ అని మార్చేశాడు. అంతేకాదు ఆ వివరాలను తన మిఠాయి దుకాణంలో పొందుపరిచాడు. ఇకనుంచి తన దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేయడానికి వచ్చే వారంతా కూడా ఇదే విధంగా పలకాలని సూచించాడు. పాక్ అనే పదం పలకడమే ఇబ్బందికరంగా ఉందని.. అదేదో బూతు లాగా ధ్వనిస్తోందని ఆ మిఠాయి దుకాణం యజమాని వ్యాఖ్యానించాడు. అంతేకాదు తన దుకాణంలో పోస్టర్లు కూడా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ మిఠాయి దుకాణం యజమాని ఒక్కసారిగా జాతీయ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ అయిపోయాడు..
వాస్తవానికి మిఠాయిల పేర్లలో చివర్లో ఉంటే” పాక్” అనేది పాకిస్తాన్ దేశానికి చెందినది కాదు. పాక్ అనే పదాన్ని కన్నడలో తీపికి ఉపయోగిస్తుంటారు. అయితే ఉగ్రవాద దేశంతో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల.. పాక్ అనే పేరు వినిపిస్తే చాలు భారతీయులు మండిపడుతున్నారు.. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలో కూడా తమలపాకుల పేర్లను కూడా మార్చేస్తారేమోనని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ” పాక్ అంటే తీపి అని అర్థమైనప్పటికీ.. ఆ పేరు పలకాలంటేనే ఇబ్బందిగా ఉంది. అందువల్లే మిఠాయిల చివరన ఉన్న ఆ పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడిక నాకు మనశ్శాంతిగా ఉంది.. నా దుకాణానికి వచ్చే కొనుగోలుదారులు కూడా సంతృప్తితో ఉంటారు. చాలా రోజులుగా వారు ఇదే విషయాన్ని నాతో చర్చిస్తున్నారు. ఏం పేరు పెడితే బాగుంటుందో ఆలోచించి.. చివరికి ఆ మిఠాయిలకు ఈ పేర్లు పెట్టానని” జైపూర్ ప్రాంతానికి చెందిన మిఠాయి వ్యాపారి వెల్లడించాడు.