
Manchu Manoj Second Marriage: మంచు మనోజ్ వివాహం మార్చి 3వ తేదీ రాత్రి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా మోహన్ బాబుకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. భూమా మౌనికతో మనోజ్ పెళ్ళికి మోహన్ బాబు నిరాకరించారట. అయితే మోహన్ బాబును ఎదిరించి మనోజ్ మౌనికను వివాహం చేసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా మోహన్ బాబు సైలెంట్ అయ్యారు. మనోజ్ వివాహంపై ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్పందించింది లేదు. కనీసం ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టలేదు.
పెళ్లి కూడా మనోజ్ అక్క మంచు లక్ష్మి ఇంట్లో చేసుకున్నారు. మంచు లక్ష్మి నివాసంలో గత మూడు నాలుగు రోజులుగా వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మాత్రం అటువైపు తొంగి చూడలేదు. కాబట్టి మోహన్ బాబుకు ఇష్టం లేకుండా మనోజ్ ఈ వివాహం చేసుకుంటున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో అసలు మోహన్ బాబు తన కొడుకు వివాహానికి వస్తారా? లేదా? అనే సందేహం నెలకొంది.
అయితే మనోజ్-మౌనికల పెళ్ళికి మోహన్ బాబు హాజరయ్యారు. మామయ్య మోహన్ బాబును చూసిన వధువు ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. మోహన్ బాబు సతీసమేతంగా ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఆయన మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి వచ్చారా? అసలు ఆయన మనసులో ఏముంది? అనే విషయాలు పక్కన పెడితే విమర్శలకు చెక్ పెడుతూ పెళ్లికి హాజరై పెద్దరికం నిలబెట్టుకున్నారు.

కాగా మోహన్ బాబుకి కూడా రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య విద్యాదేవి ప్రమాదవశాత్తు మరణించగా ఆమె సొంత చెల్లి నిర్మలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు మంచు లక్ష్మి, విష్ణు పుట్టారు. రెండో భార్య సంతానం మనోజ్. లక్ష్మి, విష్ణు, మనోజ్ ల తల్లులు వేరైనా ఒక తల్లి బిడ్డల్లానే పెరిగి పెద్దయ్యారు. ఇక మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2019లో ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగింది. మరోవైపు మౌనిక రెడ్డి 2016లో వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఒక అబ్బాయి పుట్టాడు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. ఇక కొన్ని నెలల క్రితం మనోజ్, మౌనిక తమ రిలేషన్ బయటపెట్టారు. సన్నిహితంగా ఉంటూ పెళ్లిపై హింట్ ఇచ్చారు.