
TS MLC Results: తెలంగాణలో మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌తోపాటు, బీజేపీ, కాంగ్రెస్‌లు సమాయత్తమవుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు వ్యూహరచన చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇది తమకు కలిసి వస్తుందని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఈ తరుణంలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడం గులాబీ బాస్‌ను షాక్‌కు గురిచేయగా, విపక్షాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెంచాయి. ఇదే సమయంలో తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌కు ఈ ఫలితాలు షాక్ అనే చెప్పాలి. ఉపాధ్యాయులు అధికారా పార్టీకి దూరమవుతున్నారనేందుకు ఈ ఫలితాలు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే నిరుద్యోగుల్లో వ్యతిరేకత..
తెలంగాణలో 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతీ ఒక్కరూ స్వరాష్ట్రంలో ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా, వయసు మీదపడుతున్నా తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమ సారథే సీఎం కావడంతో తమ ఆకాంక్షలు నెరవేరుతాయనుకున్న నిరుద్యోగులను కేసీఆర్ మొదటి నాలుగున్నరేళ్లు నిరాశకు గురిచేశారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్ తర్వాత మాట మార్చారు. తాను అనలేదని ప్రకటించారు. దబాయించారు. దీంతో నిరుద్యోగులు 2018 ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని భావించారు. కానీ ఇది గమనించిన గులాబీ బాస్ నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కొత్త ఎర వేశారు.
నిరుద్యోగ భృతి అంటూ..
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు నిరుద్యోగ భృతిని తాయిలంగా వేశారు. తనను గెలిపిస్తే నోటిఫికేషన్లు ఇస్తానని, ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. కానీ నాలుగేళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకుండానే గడిపేశారు. నిరుద్యోగ భృతి హామీని కూడా పక్కన పెట్టారు. దీంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబిగుతోంది. పరిస్థితిని గమనించిన గులాబీ బాస్, ఇటీవలే నోటిఫికేషన్లు ప్రకటించడం మొదలు పెట్టారు. అయినా లక్షలాది మంది నిరుద్యోగుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత చల్లారలేదు.

తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీ..
ఇప్పటికే రగిలిపోతున్న నిరుద్యోగులు, తాజాగా టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో నిరుద్యోగుల్లో కోసం నిప్పు కణికల్లా మండుతోంది. అదును కోసం ఎదురు చూస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీతో వేల మంది పరీక్ష రాసిన అభ్యర్థులు ఆగ్రహంతో సర్కార్‌పై ఊగిపోతున్నారు. మరోవైపు మిగతా పరీక్షలు జరుగతాయా లేదా అన్న సందేహం నెలకొనడంతో వేల రూపాయలు ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఉపాధ్యాయుల్లో ఆగ్రహం..
ఇక ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. గతేడాది ప్రభుత్వం తెచ్చిన జీవో 317తో ఎక్కువగా నష్టపోయింది ఉపాధ్యాయులు. ఇందులోనూ ప్రభుత్వం కొన్ని జిల్లాలను బ్లాక్‌లో పెట్టడం, ఆప్షన్ లేకుండా బలవంతంగా బదిలీ చేయడంతో ఉపాధ్యాయులు సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికీ స్పౌజ్ బదిలీల కోసం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కానీ, ప్రభుత్వం లెక్కచేయడం లేదు. పైగా కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ఉపాధ్యాయులనే దబాయించాడు. ఇక నెలనెలా చెల్లించే వేతనాలు, డీఏల పెండింగ్, ఇటీవల బదిలీలు, ప్రమోషన్లకు అనుమతి ఇచ్చినా అర్ధంతరంగా ఆగిపోవడం కూడా ఉపాధ్యాయుల్లో అసంతృప్తితో ఉన్నారు. దీని పర్యావసానమే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగుల్లోనూ వ్యతిరేకతే..
నిరుద్యోగులు, ఉపాధ్యాయుల్లోనే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ సర్కార్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. నెలనెలా ఒకటో తారీఖున వేతనాలు చెల్లించేస్థాయికి రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. వేతనాల పెంపు, డీఏ బకాయిల చెల్లింపులో ఆలస్యంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఉంది.
మొత్తంగా తాజా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం అధికార బీఆర్‌ఎస్‌పై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు, వారు సర్కార్‌కు దూరమవుతున్నారన్న సంకేతానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.