Minister Roja Hospitalized : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అస్వస్థత గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంత్రి రోజాకు ఏమైందంటూ ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి ఏ సమస్యతో ఆసుపత్రిలో చేరారు..? అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి ఆమె గడిపారు. ఈ క్రమంలోనే చిన్నపాటి సమస్య ఉత్పన్నం కావడంతో అత్యవసరంగా అపోలో ఆసుపత్రిలో వెళ్లి చేరారు. వైద్యుల పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వైద్య సేవలను అందించారు.
ఆ సమస్యతోనే ఆసుపత్రికి వెళ్లిన రోజా..
మంత్రి రోజా కుటుంబ సభ్యులతో గడుపుతున్న క్రమంలో ఆకస్మాత్తుగా కాలి నొప్పి రావడంతోపాటు తీవ్రమైన వాపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాలి వాపు తగ్గిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటూ పలువురు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆమె నియోజకవర్గంలో పూజలు చేస్తున్నారు.
నేడు డిశ్చార్జ్ చేసే అవకాశం..
కాలు వాపు పూర్తిగా తగ్గిపోతే ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు నొప్పి తగ్గడంతో పాటు వాపు కూడా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో తగ్గినట్లు అయితే ఆదివారం కూడా పర్యవేక్షణలో ఉంచి సోమవారం ఉదయం డిశ్చార్జ్ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నపాటి సమస్య కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.