https://oktelugu.com/

AP BJP : అగ్రనేతల నజర్.. ఏపీ బీజేపీలో అసలేం జరుగుతోంది?

చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిసిన తరువాతే పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీ అనుకూల మీడియాలో బీజేపీ యాడ్లు, కవరేజీ కనిపిస్తోంది. అటు టీడీపీకి అనుకూలమైన బీజేపీ నాయకులు తెరపైకి కనిపిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 11, 2023 3:15 pm
    Follow us on

    AP BJP : బీజేపీ హైకమాండ్ ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. అగ్రనేతలు వరుసగా ఏపీకి క్యూ కడుతున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా రోజు వ్యవధిలోనే ఏపీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతిలోని శ్రీకాళహస్తిలో జరిగిన భారీ బహిరంగ సభకు నడ్డా హాజరయ్యారు. విశాఖలో రెండు రోజుల పర్యటనకు అమిత్ షా నేడు రానున్నారు. ఇటీవల చంద్రబాబు వారిద్దరితో సమావేశమైన నేపథ్యంలో.. ఆ చర్చల సారాంశం బయటకు రాలేదు. అయితే ఆ అగ్రనేతలు ఇద్దరూ ఏపీకి వస్తుండడంతో ఎటువంటి సంచలనాలు నమోదవుతాయోనన్న చర్చ అయితే నడుస్తోంది.

    జేపీ నడ్డా పర్యటనలో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక సీన్ కనిపించింది. అదే ఎంపీ సీఎం రమేష్. పేరుకు బీజేపీ ఎంపీ అయినా చంద్రబాబుకు వీరాభిమాని ఆయన. టీడీపీతో బీజేపీ పొత్తు ఉండాలని బలంగా కోరుకుంటున్న నాయకుల్లో ఆయనా ఒకరు. ఇప్పుడు నడ్డా శ్రీకాళహస్తి పర్యటన అంతా సీఎం రమేష్ కనుసన్నల్లోనే జరిగింది. బహిరంగ సభకు జన సమీకరణ నుంచి సభ నిర్వహణ వరకూ అంతా రమేషే చూశారు. గతంలో బీజేపీ కార్యక్రమాల్లో ఈ స్థాయి బాధ్యతలను సీఎం రమేష్ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు కొత్తగా ఆయన యాక్టివిటీస్ మారేసరికి రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి.

    వాస్తవానికి ఈ సభకు నడ్డాతో  ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, పురందేశ్వ‌రి, స‌త్య‌కుమార్‌, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌దిత‌ర నేత‌లంతా హాజ‌ర‌య్యారు. ఎక్కువ హైలెట్ అయ్యింది మాత్రం సీఎం రమేషే. గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రజ్యోతిలో నడ్డా పర్యటనకు ఫుల్ పేజీ యాడ్ వేశారు. వార్తను కూడా ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. ఇంత అవినీతా? శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతి బ్యాన‌ర్‌గా బీజేపీ స‌భ‌ను క్యారీ చేసింది.కానీ ఎక్కడా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫొటోను కానీ..వార్తను కానీ ప్రచురించలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది.

    అయితే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిసిన తరువాతే పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీ అనుకూల మీడియాలో బీజేపీ యాడ్లు, కవరేజీ కనిపిస్తోంది. అటు టీడీపీకి అనుకూలమైన బీజేపీ నాయకులు తెరపైకి కనిపిస్తున్నారు. అగ్రనేతలతో క్లోజ్ గా ఉంటున్నారు. బీజేపీ కేంద్ర పెద్దల వైఖరితోనే ఇది జరుగుతోందన్న చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర బీజేపీ నాయకులకు కాదని.. టీడీపీ అనుకూల కాషాయదళానికి ప్రయారటీ పెరగడం కూడా అగ్రనేతల పర్యటనలో బయటపడింది. సో ఏదో సంచలన నిర్ణయాలకు బీజేపీ పెద్దలు సిద్ధపడినట్టు అనుమానాలున్నాయి. అమిత్ షా పర్యటనతో కొంత క్లారిటీ వచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరీ.