Gopichand Malineni- Chiranjeevi: అవి మురుగ దాస్ చిరంజీవి తో స్టాలిన్ చేస్తున్న రోజులు. గోపిచంద్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజులు కూడా అవే. గోపీచంద్ పని తీరు మెచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఒక వాచ్ తెప్పించారు. అల్లు అరవింద్ సమక్షంలో ఆయన చేతికి తొడిగి ఈ వాచ్ పెట్టుకుంటున్నావు.. ఇక నీ టైం బాగుంటుందని చెప్పారు. అన్నట్టుగానే ఆయన టైం బాగుంది. 2021 లో క్రాక్, 2023లో బాలకృష్ణ వీర సింహా రెడ్డి తో వరుస హిట్లు సాధించి హిట్లు కొట్టారు. కానీ తన సినీ ప్రస్థానాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తో పంచుకున్నారు.

విన్నర్ ప్లాప్ తలకిందులు చేసింది
వెంకటేష్ బాడీ గార్డ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో గోపీచంద్ విన్నర్ సినిమా తీశాడు. కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. అప్పటి దాకా గోపి వెంట ఉన్న వారు హ్యాండ్ ఇచ్చారు. ఆ టైం లో గోపీచంద్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఏడాదికి క్రాక్ సినిమా పట్టాలు ఎక్కింది. సినిమా షూటింగ్ 80% పూర్తి అయిన తర్వాత కోవిడ్ వచ్చింది. ఈ గ్యాప్ లో గోపీ రెండు స్టోరీలు రెండు రెడీ చేసుకున్నాడు. ఒకటి బాలకృష్ణ, రెండు పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఈ విషయం తెలిసిన మైత్రి నవీన్ ఫోన్ చేయడం, బాలయ్య ను కలవడం చక చకా జరిగిపోయాయి. గోపీ స్టోరీ చెప్పడం, బాలయ్య ఓకే చేయడంతో వీర సింహా రెడ్డి పట్టాలు ఎక్కింది.
నలబై ఎకరాల నుంచి 4 ఎకరాలకు వచ్చింది
గోపీచంద్ నాన్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా పని చేసేవారు. అప్పట్లో ఆయన కొన్న సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి.. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. అప్పులు తీర్చేందుకు ఆయన భూములు అమ్మవలసి వచ్చింది. అలా 40 ఎకరాలు కాస్తా నాలుగు ఎకరాలకు పడి పోయింది. పైగా గోపి చంద్ నాన్నకు తాగుడు అలవాటు ఉండేది. అప్పులు తెచ్చి దోస్తులకు పార్టీలు ఇచ్చేవారు. దీంతో చిన్నతనంలో గోపీచంద్ చాలా కష్టాలు పడ్డారు. సినిమా నేపథ్యం ఉండడంతో ఇంటర్ కూడా డిస్ కంటిన్యూ చేశారు.

ఎవరూ డబ్బులు ఇవ్వ లేదు
గోపీచంద్ తీసిన సినిమాలకు సంబంధించి నిర్మాతలు ఎవరు కూడా సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు.. ముఖ్యంగా క్రాక్ సినిమా నిర్మాత ఇప్పటికి 75 లక్షల బాకీ ఉన్నాడు.. అవి ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియదు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మాత్రమే గోపీచంద్ కు పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చారు. గోపీచంద్ ప్రతీ కథకు బ్రెట్ క్రిటిక్ అతడి భార్య, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్…వీళ్ళు ఓకే అంటే ఆ సినిమా హిట్. లేకుంటే ఫట్. ఇక గోపీచంద్ పెళ్లి కూడా సినిమాటిక్ గానే జరిగింది. ఓ రోజు పెద్దమ్మ గుడిలో ఓ అమ్మాయిని చూశాడు. ఆరా తీస్తే ఆమెది ఏలూరు అని తెలిసింది . తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ద్వారా వాకబు చేస్తే సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వమని ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పేశారు.. దీంతో వాళ్లని ఒప్పించి గోపీచంద్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. ఇక గోపీచంద్ శ్రీహరి సినిమాలకు ఎక్కువగా పని చేసేవారు.. ఆయన సినిమాలు 40 నుంచి 60 రోజుల్లో పూర్తి అయ్యేది.. దీనివల్ల గోపీచంద్ చేతినిండా పని ఉండడంతో… ఆర్థిక కష్టాలు వెంట వెంటనే తీరిపోయేవి.