Singer Mangli: స్టార్ సింగర్ మంగ్లీ తన పై రాళ్ల దాడి జరిగిందన్న వార్తలను ఖండించారు. అది కేవలం తనపై జరిగిన దుష్ప్రచారంగా కొట్టిపారేశారు. దీంతో ఆమె అభిమానులు అయోమయంలో పడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో గల బళ్లారి మున్సిపల్ స్టేడియం లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఆమె తన కారులో హైదరాబాద్ కి వస్తుండగా రాళ్ల దాడి జరిగిందనే వార్తలు కలకలం రేపాయి. కొందరు దుండగులు మంగ్లీ కారుపై రాళ్లు రువ్వి అక్కడి నుండి పారిపోయారు. కారు అందాలు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చెప్పట్టారంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది.

దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు. వీడియోలు బయటకు వచ్చాయి. చిక్బళ్లాపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మంగ్లీ తెలుగులో మాట్లాడటానికి నిరాకరించారని. అందుకు నిరసనగా కన్నడిగులు ఆమెపై దాడి చేశారనేది కథనాల సారాంశం. ఈ వార్తలపై మంగ్లీ స్పందించారు. తనపై ఎలాంటి దాడి జరగలేదు. ఇది కేవలం దుష్ప్రచారమంటూ అసహనం వ్యక్తం చేశారు.
నాపై దాడి జరిగిందన్న వార్తలను నేను ఖండిస్తున్నాను. కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలు కావాలని చేస్తున్న దుష్ప్రచారం ఇది. కన్నడ ప్రజలు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. వారి ఆదరణ మరవలేనిది. మా ఈవెంట్ ఎంతగా సక్సెస్ అయ్యిందో ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది. కన్నడిగుల ప్రేమాభిమానాలకు నేను సంతోషించాను. అధికారులు, ఆర్గనైజర్స్ ఎంతో గొప్పగా నన్ను ట్రీట్ చేశారు. మాటల్లో చెప్పలేనంతగా నా పట్ల వ్యవహరించారు.

నాపై దాడి జరిగిందని కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తల ద్వారా నా గౌరవానికి భంగం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ తరహా చర్యలను నేను ఖండిస్తున్నాను, అని సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశం విడుదల చేశారు.దీంతో అసలు మంగ్లీ మీద దాడి జరిగిందా లేదా అనే కన్ఫ్యూజన్ నెలకొంది.కాగా తెలుగులో స్టార్ సింగర్ గా మంగ్లీ వెలిగిపోతుంది. ఓ సాధారణ గిరిజన అమ్మాయి అయిన మంగ్లీ సహజంగా సంక్రమించిన టాలెంట్ తో ఫేమస్ సింగర్ అయ్యారు. ఆమె గొంతు ప్రత్యేకంగా ఉంటుంది. మంగ్లీకి లక్షల్లో అభిమానులు ఉన్నారు.