CM Jagan Birthday: కోట్లాది మంది అభిమానించే జన హృదయ నేత జగన్… ఏపీలో వైసీపీ నేతలు తమ అధినేతను ఉద్దేశించి నిత్యం చేసే వ్యాఖ్య ఇది. అందుకు తగ్గట్టుగానే ఆయనపై ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. ఆయన మంచి చేసినా.. చెడు చేసినా వారిది ఒకటే బాణి. మా నాయకుడు.. మా మంచి నాయకుడు అన్న స్లోగన్ తప్ప.. ఇంకొకటి వారికి తెలియదు. అంతగా అభిమానించిన తమ నేత పుట్టిన రోజు అంటే వారికి పండుగే. కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మానందం పుట్టిన రోజుకు హీరో నాగార్జున బృందం ఏర్పాటు చేసి తరహాలో రాష్ట్రమంతటా బ్లడ్ డొనేషన్ కు ప్లాన్ చేశారు. అది బలవంతగా సేకరించడానికి నిర్ణయించారు. ఆ రక్తాన్నే రక్తనిల్వల కేంద్రాలకు తరలించి..పుణ్యం, పురుషార్థం తమ అధినేత ఖాతాలో వేసేందుకు తెగ ఆరాట పడుతున్నారు.

రక్తదానం అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసేది. అదే బలవంతంగా సేకరించడం అంటే.. మనిషి నుంచి పిండుకోవడం అంటారు. అయితే ఇప్పుడు జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ పిండుకోవడానికే ప్లాన్ చేశారు. ఇందుకుగాను ప్రత్యేక వెబ్ సైట్ నే ఆవిష్కరించారు. అందులో పేర్లు నమోదుచేస్తే చాలూ రక్తం ఎప్పుడైనా? ఎక్కడైనా ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టే. అయితే ఆలోచన మంచిదే మరి ఇచ్చేదెవరు? అన్నదే ప్రశ్న. ఇక్కడ కూడా మంచి ఆలోచన చేశారు. మీకు పథకాలు ఇస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా, వసతి దీవెన అందిస్తున్నారు కాబట్టి.. మీరే రక్తం ఇవ్వాల్సి ఉంటుందని లబ్ధిదారులు, విద్యార్థులను ఫోర్స్ చేస్తున్నారు. వలంటీర్లు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. కొందరి పేర్లను బలవంతంగా, బహిరంగంగానే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.
జగన్ కోసం జనం తహతహలాడుతున్నారని చెప్పుకోవడానికే ఈ బ్లడ్ డొనేషన్ ముఖ్య ఉద్దేశ్యం. రక్తదానం చేసేందుకే లక్షలాది మంది ముందుకొస్తే.. ఇక ఓటు వేసేవారు ఎంతమంది ఉంటారో లెక్కలు కట్టి మరీ చెప్పుకునేందుకే ఈ కొత్త ప్లాన్ అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బలవంతపు రక్తసేకరణపై మాజీ ఎంపీ హర్షకుమార్ రియాక్ట్ అయ్యారు. చరిత్రలో కనివినీ ఎరుగని రక్తదానం ఇదంటూ సెటైర్లు వేశారు. రక్తం ఇచ్చేందుకు లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారని.. జగన్ పై జనానికి ఉన్న ప్రేమాభిమానాలు చెక్కుచెదరలేదని చెప్పుకోవడానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను వైసీపీ నాయకులు వేదికగా మలుచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలకు అవగాహన కల్పించి వారిని రక్తదానం వైపు అడుగులు వేయిస్తే అదొక ఉద్యమే. అందరూ ఆహ్వానించదగ్గదే. కానీ అదే రక్తదానాన్ని తమ అధినేత ఇమేజ్ కు జతకలపాలని చూపుతుండడమే అసహ్యం వేస్తోంది. సామాజిక బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలో రక్త నిల్వలు పెంచితే ఆపదలో ఉన్న ఎంతో మందిని కాపాడినవారవుతారు. అలా కాదు పథకాలు ఇచ్చామని లబ్ధిదారుల నుంచి.. రాయితీలు కల్పించామని విద్యార్థుల నుంచి రక్తాన్ని పిండుకోవాలని చూస్తే మాత్రం అది రక్త దోపిడీగా మిగులుంది. జగన్ వంటి నాయకుడికి మాయని మచ్చగా నిలుస్తుంది.