Hyderabad: కుటుుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితుల మధ్య ఎంతో ఆడంబరంగా జరగాల్సిన చాలా పెళ్లిళ్లు వినూత్నంగా జరుగుతున్నాయి. పెళ్లిచేసుకోబోయే వారు అప్పటి వరకు బాగానే ఉండి తాళి కట్టే సమయానికి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. పెళ్లంటే ఇష్టంలేని కొందరు పెళ్లివరకు వేచి చూసి సరిగ్గా తాళికట్టే సమయానికి ఇతర వ్యక్తులతో జంప్ కొడుతున్నారు. లేటేస్టుగా ఓ పెళ్లిలో ఊహించిన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. కానీ మూడుముళ్ల సమయానికి వరుడు కనిపించలేదు. తమ కూతురు ప్రేమను ఒప్పుకున్నా వరుడు లేకపోయేసరికి అమ్మాయి తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంతకీ వరుడు ఎక్కడికి వెళ్లాడంటే?
ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు ఒప్పుకునేవారు కాదు. కానీ కాలం మారుతున్న కొద్దీ వారు కూడా తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకుంటున్నారు. దీంతో వారి ప్రేమను కాదనలేక పెళ్లిళ్లు ఆడంబరంగా పెళ్లి చేస్తున్నారు. హైదరాబాద్ లోని జీడిమట్లకు చెందిన ఓ జంట ప్రేమించుకుంది. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడి రహస్యంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల పాటు ఈ జంట కాపురం కూడా చేసింది. ఎందుకైనా మంచిదని పెద్దలకు ప్రేమ విషయాన్ని చెప్పారు. వారు ఒప్పుకోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారి పెద్దలు కూడా ఆ పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక్కడే వరుడు ట్విస్ట్ ఇచ్చాడు. సరిగ్గా తాళి కట్టే సమయంలో ఆయన కనిపించకుండా పోయాడు. కల్యాణ మండపం మొత్తం వెతికినా ఆయన కనిపించలేదు. పోనీ అతనికి పెళ్లి ఇష్టం లేదా? అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీరిది ప్రేమ వివాహమే. దీంతో వధువు కుంగిపోయింది. అసలేం జరిగిందో తెలియక కన్నీళ్లు పెట్టుకుంది. కానీ బంధువులు మాత్రం వరుడి కోసం తీవ్రంగా గాలించారు. అయినా కనిపించలేదు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తీవ్రంగా గాలించగా వరుడు కనిపించాడు. అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నాడు.
అయితే వధువు మాత్రం ఆ పెళ్లి కొడుకు గురించి ఆలోచనలో పడింది. ముందుగా ప్రేమ వివాహం చేసుకున్న అతను పెద్దల సమక్షంలో పెళ్లి అనేసరికి ఎందుకు భయపడ్డాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలాంటి వాళ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ప్రేమించే సమయంలో వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని అంటున్నారు. మోసగాళ్ల మాయలో పడిపోతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు.