Madhya Pradesh: దొంగలు చోరీ చేసే సమయంలో ఏదో ఒక తప్పు చేస్తారు. చిన్న క్లూ అయినా వదిలి వెళ్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పోలీసులు వాసన చూసి పట్టేస్తారు. పట్టుకోవడం ఆలస్యం కావొచుచ కానీ.. పట్టుకోవడం ఖాయం. అయితే తాజాగా ఓ దొంగను వాట్సాప్ డీపీ పట్టించింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. ఈశ్వరుడు పట్టలేదు కానీ.. వాట్సాప్ డీపీ దొంగ దొరికేలా చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
నమ్మకంగా ఉంటూ..
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ సంపన్న కుంటుంబం పనిమనిషిగా మహిళను పెట్టుకుంది. చాలాకాలంగా నమ్మకంగా పనిచేస్తుండడంతో ఇంట్లో సభ్యురాలిగా మారిపోయింది. నమ్మకంగా ఉంటుండడంతో యజమానులు కూడా ఆమెను బాగా నమ్మారు. పనిమనిషిగా కాకుండా కుటుంబంలో ఒకరిగా చూశారు. దీంతో ఇంట్లోని రహస్యాలు కూడా ఆమెతో పంచుకునేవారు.
రూ.50 లక్షల ఆభరణాలు అపహరణ..
ఈ క్రమంలో ఆ సంపన్న కుటుంబం బయటకు వెళ్లింది. దీనిని గమనించిన సదరు పనిమనిషికి.. సంపదపై ఆశ పుట్టింది. ఈ క్రమంలో ఆ ఇంట్లోని బీరువాల్లో ఉన్న రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలను అపహరించింది. ఎవరికీ అనుమానం రాకుండా చాకచర్యంగా దొంగతనం చేసింది. ఇంటికి వచ్చిన యజమాని కుటుంబం ఇంట్లో నగలు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
చిన్న క్లూ కూడా దొరకలేదు..
పోలీసులు విచారణ చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాల సేకరణకు యత్నించారు. అయితే ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే పనిమనిషి కూడా వారితోనే ఉండడంతో ఎవరూ అనుమానించలేదు. మరోవైపు నమ్మకస్తురాలిగా ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. పోలీసులు దొంగల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
వాట్సాప్ డీపీ చూసి..
నగలు చోరీ అయి నెలలు గడుస్తున్నాయి. కానీ దొంగ మాత్రం దొరకలేదు. ఈ క్రమంలో సదరు పనిమనిషి అంతా చోరీ గురించి మర్చిపోయారని భావించింది. అపహరించిన యజమాని ఆభరణాలు అలంకరించుకుని ఫొటోలు దిగింది. ఓ రోజు యజమాని ఇయర్ రింగ్స్ పెట్టుకుని దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుంది. సాధారణంగా యజమానురాలు వాట్సాప్ డీపీలు చూస్తుండగా పనిమనిషి పెట్టుకున్న ఇయర్‌రింగ్స్ తన ఇయరింగ్స్‌లానే అనిపించడంతో అనుమానం మొదలైంది.
ఏమీ అనకుండా పోలీసులకు సమాచారం..
తర్వాత పనిమనిషి ప్రవర్తనను నిషితంగా గమనిస్తూ వచ్చింది. తేడా గమనించింది. దీంతో ఆమెను ఏమీ అనకుండా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కూడా పనిమనిషిపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలు సేకరించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి బంగారు నగలతోపాటు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కటకటాలకు పంపించారు.
పోలీసులకు కూడా క్లూ దొరకకుండా దొంగతనం చేసిన పనిమనిషి.. చివరకు వాట్సాప్ డీపీతో అడ్డంగా దొరికిపోయింది.