KCR- RBI 2000 Note Ban: పెద్ద నోట్ల రద్దు 2016లో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి. ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత్రి 10 గంటల సమయంలో దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాటి స్థానంలో రూ.2000 నోట్లు ముద్రిస్తామని ప్రకటించారు. దీని ఫలితం కూడా ఎలా ఉంటుందో ప్రకటించారు. బ్లాక్ మనీ బయటకు వస్తుందని తెలిపారు. అయితే ఆశించిన ఫలితం రాలేదు. చలామనిలో ఉన్న పెద్దనోట్లు మాత్రమే బ్యాకులకు తిరిగి వచ్చాయి. తాజాగా మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 2016 నుంచి 2018 వరకు ముద్రించిన రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి నష్టం లేదు. కానీ, ఇప్పుడు ఇబ్బంది పడేది ధనిక రాజకీయ పార్టీలు, బ్లాక్ మనీ ఉన్న బడా వ్యాపారులు మాత్రమే.
ఎన్నికలకు ఏడాది ముందు..
సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న సుమారు 6 లక్షల రూ.2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ సూచించింది. వాటిని బ్యాంకుల్లో కస్టమర్లకు ఇవ్వొద్దని ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు డిపాజిట్‌కు అవకాశం కల్పించింది. అయితే ఎన్నికలకు ఏడాది ముందు తీసుకున్న నిర్ణయంతో దేశంలోని చాలా పార్టీలకు ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీఆర్‌ఎస్‌కు నోట్ల మార్పిడి కష్టాలు..
దేశంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల అత్యధిక ఆదాయం పొందిన మూడో ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్ నిలిచింది. మొదటి స్థానంలో డీఎంకే, రెండో స్థానంలో బీజేడీ నిలిచాయి. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) తన తాజా నివేదికలో వెల్లడించింది. తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) రెండో స్థానంలో, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ (గతంలో టీఆర్‌ఎస్) మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ కంటే రెండు పార్టీలు ముందున్నా.. కష్టాలు మాత్రం ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కే. ఎందుకంటే మరో ఆరు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. మరోవైపు ఈసారి కూడా నోట్లతో గెలవాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆర్‌బీఐ రూ.2000 నోట్లు రద్దు చేయడం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారనుంది.
వ్యూహాత్మకమేనా..
వచ్చే ఆరు నెలల్లో తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగానే రూ.2000 నోట్ల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ గడువు కూడా సెప్టెంబర్ 30 వరకు విధించడం కూడా వ్యూహాత్మకమే అన్న చర్చ జరుగుతోంది. దీని ప్రభావం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని పార్టీలపైనే అధికంగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ దెబ్బతో జాతీయ రాజకీయాల్లో చంక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.