
Mahesh Babu: సంక్రాంతి అంటే సినిమా సీజన్. కాసులు కురిపించే పండగ. తెలుగువారి పెద్ద పండగకు చిత్ర వర్గాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని ప్రణాళికలు వేస్తారు. సంక్రాంతికి ఇంటిల్లిపాది థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం ఆనవాయితీగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి ఘనంగా నిర్వహిస్తారు. ఇక సంక్రాంతి కొందరు హీరోలకు మరపురాని విజయాలు అందించింది. ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ కట్టబెట్టింది. మరి సూపర్ స్టార్ మహేష్ కి సంక్రాంతి కలిసొచ్చిందా అంటే… అవును అని చెప్పాలి.
హీరోగా 27 సినిమాలు చేసిన మహేష్ కేవలం 7 సార్లు సంక్రాంతి బరిలో దిగారు. మొత్తంగా చూసుకుంటే విజయాల శాతమే ఎక్కువగా ఉంది. మహేష్ మొట్టమొదటి సంక్రాంతి రిలీజ్ టక్కరి దొంగ. 2002లో విడుదలైన ఈ చిత్రానికి జయంత్ సి పరాంజీ దర్శకుడు. మహేష్ కౌ బాయ్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టక్కరి దొంగ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సాంగ్స్ మాత్రం అద్భుతంగా కుదిరాయి. ఆ నెక్స్ట్ ఇయర్ 2003లో మహేష్ మ్యాజిక్ చేశారు. కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డ్స్ తిరగరాసింది.
ఒక్కడు తర్వాత మళ్ళీ మహేష్ బాబు సంక్రాంతికి రాలేదు. చెప్పాలంటే కుదరలేదు. 11 ఏళ్ల గ్యాప్ తర్వాత 2012లో బిజినెస్ మాన్ మూవీతో సంక్రాంతికి వచ్చారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి సూపర్ హిట్. ఇక 2013లో మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. వెంకీ మరో హీరోగా నటించగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.

2014లో వన్ నేనొక్కడినే సంక్రాంతి బరిలో నిలిచింది. దర్శకుడు సుకుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. హాలీవుడ్ కాన్సెప్ట్ తో ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన వన్ నేనొక్కడినే నిరాశపరిచింది. అనంతరం ఆరేళ్ళ గ్యాప్ తర్వాత 2020 లో సరిలేరు నీకెవ్వరు విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ కొట్టింది. తాజాగా తన 28వ చిత్రం సంక్రాంతి కానుకగా 2024లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మహేష్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.