Madhya Pradesh: వానాకాలంలో గేమ్స్‌ వద్దు.. కారుతో జలపాతంలో పడిపోయిన తండ్రీ కుమార్తెలు.. వైరల్‌ వీడియో

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలోని లోహియా కుంద్‌ జలపాతాన్ని చూడడానికి ఆదివారం సాయంత్రం కారులో బయలుదేరిన కుటుంబం ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంది.

Written By: Suresh, Updated On : August 8, 2023 11:26 am

Madhya Pradesh

Follow us on

Madhya Pradesh: అసలే వానాకాలం.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుంతులు నీళ్లు నిండి ఉంటాయి. గమనించకుండా.. అంచనా వేయకుండా వెళితే పల్టీ కొట్టాల్సిందే. ఇక బావులు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమౌతుందిలే.. నాకు ఈత వచ్చు అని ఈజీగా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు తప్పదు. ఎక్కువ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి. ఇది కూడా అలాంటిదే. జలపాతం చూడ్డానికి కుటుంబంతో కలిసి కారులో వెళ్లిన ఓ వ్యక్తి, కారు హ్యాండ్‌ బ్రేక్‌ వేయడం మరిచిపోయాడు. ఫలితంగా ఓ చిన్నారితో సహా, కారు జలపాతంలో పడింది. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో జరిగింది ఈ ఘటన.

జలపాతం పక్కనే నిలిన కారు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలోని లోహియా కుంద్‌ జలపాతాన్ని చూడడానికి ఆదివారం సాయంత్రం కారులో బయలుదేరిన కుటుంబం ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంది. వారు తమ వాహనాన్ని జలపాతానికి సమీపంలో నిలిపిఉంచారు. కొద్దిసేపటి తర్వాత కారు దానంతట అదే అకస్మాత్తుగా జలపాతం వైపు జారిపోయింది. అంతా చూస్తుండగానే జలపాతంలోకి పడిపోయింది. చుట్టుపక్కలవారు తండ్రీకుమార్తెలను కాపాడారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం సెలవు రోజని..
తాజాగా కురిసిన వర్షాలకు ఇండోర్‌ శివార్లలోని లోహియా కుంద్‌ జలపాతం నిండుకుండలా మారింది. సుందరంగా తయారైంది. దీన్ని చూసేందుకు స్థానికులతోపాటు, చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఓ చిన్న పిక్నిక్‌ స్పాట్‌ గా మారింది ఆ ప్రాంతం. అయితే సెక్యూరిటీ మాత్రం సరిగ్గా లేదు. ఆదివారం సెలవు కావడంతో చాలా మంది జలపాతం చూడడానికి వచ్చారు. సిమ్రోన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో లోహియా కుంద్‌ కు చేరుకున్నాడు. దాదాపు జలపాతం వరకు కారును పోనిచ్చాడు. కారు నుంచి ఇద్దరు దిగారు. తండ్రికూతుళ్లు దిగడానికి రెడీ అవుతున్నారు.

హ్యాండ్‌ బ్రేక్‌ వేయడం మర్చిపోవడంతో..
కారు డ్రైవింగ్‌ చేసిన తండ్రి కారు ఆపిన తర్వాత హ్యాండ్‌ బ్రేక్‌ వేయలేదు. మరోవైపు జలపాతం అంచున నిలిపి ఉంచాడు. దీంతో లోతట్టుగా ఉన్న ఆ ప్రాంతంలో కారు రయ్‌ మంటూ జలపాతంవైపు దూసుకుపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే క్షణాల్లో కారు జలపాతంలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అదేమంత పెద్ద లోతుగా లేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లు వెంటనే నీళ్లలోకి దూకి వాళ్లను కాపాడారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
అక్కడికి వచ్చిన వారు జలపాతం అందాలు చూస్తూ.. సెల్‌ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే కారు జలపాతంలో పడిపోవడంతో ఆ వీడియోను చిత్రీకరించారు. జలపాతంలో పడి సాయం కోసం తండ్రి, కూతురు అర్థించడం అందులో స్పష్టంగా వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వర్షాకాలంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు తప్పవని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కారును జలపాతం అంచు వరకు తీసుకెళ్లిన తండ్రిని తిట్టిపోస్తున్నారు. లక్కీఫెలోస్‌ అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.