Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలు తమిళనాడును అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ప్రజలను మాత్రం కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
వరదల్లో శ్మశాన వాటికలు..
ఇటీవలి వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లాయి. వరదల వల్ల శ్మశాన వాటికలు మునిగిపోవడంతో అక్కడి ప్రజలు శవాలను ఇళ్ల ముందే కాల్చే దుస్థితి ఏర్పడింది. శ్మశాన వాటికలు ఇప్పటికీ రెండు అడుగుల నీటిలో మునిగి ఉన్నాయి. చనిపోయిన వారికి ఇంటి ముందే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. దీని కోసం మొబైల్ శ్మశానవాటికను ఉపయోగిస్తున్నారు. కొంతమంది తమవారి మృతదేహాలను దహన సంస్కారాల కోసం సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రత్యామ్నాయంగా..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షం కారణంగా వివిధ కులాలకు చెందిన వారికి కేటాయించిన 12 శ్మశాన వాటికలు నిరుపయోగంగా మారాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా స్థానికులు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగించి తాత్కాలిక శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. ఎల్పీజీ సిలిండర్లు వాడి శవాలను దహనం చేస్తున్నారు. ఇక క్రై స్తవులు తమ బందువుల మృతదేహాలను వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. హిందువులు దహనసంస్కారాల కోసం మొబైల్ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు.