Laxmiparvathy: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఏపీలో పెద్ద వివాదమైంది. దీనిపై నందమూరి ఫ్యామిలీ భగ్గుమంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్వీట్లతో విరుచుకుపడ్డారు. టీడీపీ, చంద్రబాబు అయితే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తో కలిసి జీవితాన్ని పంచుకున్న ఆయన భార్య లక్ష్మీపార్వతి రియాక్షన్ కోసం అందరూ ఎదురుచూశారు.

లక్ష్మీపార్వతి జగన్ ఇచ్చిన తెలుగు అకాడమీ చైర్మన్ పదవిని రాజీనామా చేస్తారాని.. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘ఎన్టీఆర్’కు జరిగిన అవమానంపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ లక్ష్మీపార్వతి స్పందన చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్న పరిస్థితి.
‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ కు అర్హత లేదని.. ఆ అర్హత వైఎస్ఆర్ కే ఉందన్న జగన్ వ్యాఖ్యలను లక్ష్మీపార్వతి సమర్థించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ఒకరి పేరు తొలగించి.. మరొకరి పేరు పెట్టడం వల్ల ఎవరికీ నష్టం జరిగినట్లు కాదని లక్ష్మీపార్వతి అన్నారు. మానవత్వం ఉన్నవారంతా పేరు మార్చడాన్ని ఆమోదించారని అన్నారు.
తన భర్త ఎన్టీఆర్ పేరును తీసేసినా కూడా మానవత్వం ఉన్న వారు ఆమోదించాలన్న లక్ష్మీపార్వతి తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్టీఆర్ పేరు తీసేశారని.. ఆయన అభిమాని అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏకంగా జగన్ ఇచ్చిన పదవిని తృణప్రాయంతో వదిలేసుకొని రాజీనామా చేశారు. ఆయన సహజన్మచారిణిగా కొనసాగిన లక్ష్మీపార్వతి మాత్రం ఇంకా జగన్ ను వెనకేసుకొచ్చి ఎన్టీఆర్ పేరు మార్పును సమర్థించడమే అందరినీ షాక్ కు గురిచేస్తోంది.