Lagadapati Rajagopal: గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మాజీ ఎంపీ లగటిపాటి రాజగోపాల్. అటు తన హాబీ అయిన ఎన్నికల సర్వేలను సైతం నిలిపివేశారు, గత ఎన్నికల తరువాత అడపాదడపా కనిపిస్తున్నారు. మీడియాకు కూడా దొరకడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పొలిటికల్ గా రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఆయన విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన వరకూ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2003లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో పారిశ్రామికవేత్తగా ఉన్న రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కు ప్రధాన అనుచరుడిగా మారారు. ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ పోషించారు. ల్యాంకో రాజగోపాల్ గా పరిచయమైనా.. లగడపాటిగానే తన ముద్ర చాటుకున్నారు. నాడురాజకీయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు.

రాష్ట్ర విభజన సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎంపీల్లో లగడపాటి పేరు ముందు వరుసలో ఉండేది. పార్లమెంట్ లో ఏకంగా తెలంగాణ ఎంపీల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా నిండు లోక్ సభలో ప్రకటించారు. రాష్ట్ర విభజన జరగడంతో అన్నట్టుగానే రాజకీయ సన్యాసం చేశారు. 2014 నుంచి ఇప్పటివరకూ ఎక్కడా పోటీచేయలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కేవలం రాజకీయనాయకుడిగానే కాకుండా ఎన్నికల్లో సర్వేలు చేయడం హాబీగా పెట్టుకున్నారు. 2004 నుంచి సర్వేలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సర్వేలు చేసి ఇవ్వడం.. అవి వాస్తవానికి దగ్గరగా ఉండడంతో లగడపాడి ఇమేజ్ మరింత పెరిగింది. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వంలో మంచి పరపతినే సొంతం చేసుకున్నారు. అయితే 2018 తెలంగాణ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన లెక్క తప్పింది. అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. అనూహ్యంగా టీఆర్ఎస్ తిరిగి అధికారం చేపట్టింది. అటు 2019 ఎన్నికల్లో సైతం ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. జరగకపోతే సర్వేలు నిలిపివేస్తానన్నారు. టీడీపీ ఘోర ఓటమితో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇక సర్వేలకు స్వస్తి అని ప్రకటించేశారు. అప్పటి నుంచి బయటకు కనిపించింది కూడా తక్కువే.

తాజాగా ఆయన మరోసారి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. మరోసారి విజయవాడ ఎంపీగా పోటీచేస్తారని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తరుపున బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లతో సమావేశమయ్యారని వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అంటే చాలామంది నాయకులకు గిట్టడం లేదు. అందుకే నాని కుమార్తెను ఎమ్మెల్యేగా పోటీచేయించి .. లగడపాటికి ఎంపీగా పోటీచేసేందుకు లైన్ క్లీయర్ చేసినట్టు సమాచారం. అంటే కొద్ది నెలల్లో రాజకీయ సన్యాసం వీడి లగడపాటి సైకిలెక్కుతారన్న మాట.