Monalisa : ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళా(Prayagraj Mahakumbh) లో పూసల దండాలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలీసా(Monalisa) అనే అందమైన అమ్మాయి, రాత్రికి రాత్రి సెలబ్రిటీ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ అమ్మాయి పేరిట సోషల్ మీడియా లో ఫ్యాన్ క్లబ్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ. ఈమె పాపులారిటీ, క్రేజ్, అందాన్ని చూసి షాక్ కి గురైన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సనోజ్ మిశ్రా(Sanoj Mishra) ఆమె ఇంటిని వెట్టుకుంటూ వచ్చి, తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానంటూ ముందుకొచ్చాడు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో ఆమె కథానాయికగా నటించబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. పూసల దండాలు అమ్ముకునే ఒక సాధారణ అమ్మాయి దశ మొత్తం మారిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న వారికి మోనాలిసా ఒక పెద్ద సవాలు గా మారనుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు.
ఈమెకు క్రేజ్ విపరీతంగా పెరగడం తో ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ లోకి వచ్చిన రోజే లక్షల సంఖ్యలో అభిమానులు అనుసరించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా పలు బ్రాండ్స్ కి ఈమె అంబాసిడర్ గా కూడా మారిపోయింది. అయితే రీసెంట్ గా ప్రముఖ నిర్మాత జితేంద్ర నారాయణ్(Jithendra Narayan) సనోజ్ మిశ్రా పై తీవ్రమైన ఆరోపణలు చేసాడు. సనోజ్ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ గా మారిపోయిన మోనాలిసా పేరు ని వాడుకొని, ఆయన వార్తల్లో నిలబడడానికి చూస్తున్నాడని, తద్వారా ఫైనాన్షియర్స్ ని ఆకర్షించి డబ్బులు తీసుకునే ప్లాన్ లో ఉన్నాడని , మోనాలిసా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆమె కెరీర్ రిస్క్ లో పడింది అంటూ చెప్పుకొచ్చాడు జితేంద్ర నారాయణ్. దీనిపై మోనాలిసా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘సనోజ్ మిశ్రాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన నన్ను సొంత కూతురిలాగా చూసుకుంటున్నాడు. ఎవరి ట్రాప్ లోనో పడేంత అమాయకురాలిని కాదు నేను, మనిషి ప్రవర్తన ని చూసి ఎవరు ఎలాంటి వాడు అనే విషయాన్ని పసిగట్టేంత తెలివి ఆ దేవుడు నాకు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం నేను మధ్యప్రదేశ్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. నాతో పాటు నా సోదరి, పెద్దనాన్న ఉంటున్నారు. సనోజ్ మిశ్రా ఎంతో మంచి వాడు, మాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. త్వరలో ప్రారంభం అవ్వబోయే మా సినిమా సవ్యంగా, ఎలాంటి అవాంతరాలు రాకుండా జరగాలని అందరూ ఆశీర్వదించండి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మోనాలిసా కి బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయట. కానీ ఆమె యాక్టింగ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాతే తదుపరి చిత్రాలకు సంతకం చేస్తానని చెప్పుకొచ్చిందట.