
KTR: తెలంగాణలో త్వరలో ముఖ్యమంత్రి మారబోతున్నాడా.. యువరాజు కేటీఆర్‌కు పట్టాభిషేకం ఖాయమేనా.. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయిందా.. అంటే బీఆర్‌ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ప్రస్తుత సర్కార్‌కు మరో ఎనిమిది నెలల గడువు ఉంది. ఈలోగా తన కొడుకును సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరాటపడుతున్నారు. ఈమేరకు తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఇప్పటికే ప్రజలకు ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. బడ్జెట్ సమావేశాల్లో తాను పోషించే పాత్రను తన కొడుకు ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు అప్పగించేశాడు.
గవర్నర్ ప్రసంగానికి కేటీఆర్ ధన్యవాదాలు..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సబంధించిన బడ్జెట్‌ను కూడా హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. సమావేశాలు ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం ఉండడంతో ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాత్రం కేసీఆర్ కనిపించలేదు. నిజానికి సభాధ్యక్షుడు అయిన కేసీఆర్ ఈ తీర్మానానికి సమాధానం చెప్పాలి. కానీ ఆ బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. విపక్షాల విమర్శలన్నింటికీ ఆయనే సమాధానం చెప్పారు. తర్వాత తీర్మానం ఆమోదం పొందింది. కేసీఆర్ తన బాధ్యతల్ని అసెంబ్లీ వేదికగా కేటీఆర్‌కు అప్పగించడంపై సొంత పార్టీలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ అనుకూల మీడియా ఇప్పటికే కేటీఆర్ సీఎం కాబోతున్నారని ప్రచారం కూడా ప్రారంభించింది.
గవర్నర్‌తో అందుకే సఖ్యత..
ప్రగతి భవన్, రాజ్‌భవన్‌కు మధ్య సుమారు రెండేళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. గవర్నర్‌కు కేసీఆర్ సర్కార్ కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ నేతలు సైతం గవర్నర్‌పై విమర్శలు చేశారు. అయినా సీఎం కేసీఆర్ ఏనాడూ ఖండించలేదు. ఓ ఎమ్మెల్సీ అయితే తాము గవర్నర్‌ను తిడితే కేసీఆర్ సంతోషపడతారని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండేళ్లుగా గవర్నర్ తమిళిసైని అసెంబ్లీకి రాకుండా చేసిన కేసీఆర్ ఈసారి మెట్టుదిగి గవర్నర్‌ను ఆహ్వానించారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసగంతోనే ప్రారంభించారు. దీంతో తన కొడుకును సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే చంద్రశేఖర్‌రావు గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

పట్టాభిషేకం సాఫీగా జరుగుతుందా
కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం అంటూ.. పదవి నుంచి వైదొలిగి.. కేటీఆర్ ను సీఎం చేస్తారని.. ఆయన నేతృత్వంలోనే ఈ ఏడాది బీఆర్‌ఎస్ ఎన్నికలు ఎదుర్కొంటుందని కథనాలు వండి వారుస్తున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ముందస్తుకు వెళ్లడం.. లేకపోతే.. కేటీఆర్‌ను సీఎం చేయడం.. ఈ రెండింటిలో కేసీఆర్ ఓ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా నమ్ముతున్నారు. బడ్జెట్‌ను ఫిబ్రవరిలోనే పెట్టడం.. అసెంబ్లీ సమావేశాలు కూడా వేగంగా పూర్తి చేయడం వెనుక కచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. సచివాలయం ప్రారంభం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ తర్వాత బీఆర్‌ఎస్ రాజకీయాల్లో కీలక మలుపులు ఉంటాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే.. సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌రావు వ్యతిరేకతల నడము కేటీ ఆర్ పట్టాభిషేకం అంత ఈజీగా జరుగుతుందా.. జరిగినా కలిసి పనిచేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.