Superstar Krishna Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరం ప్రస్థానం ముగిసింది. నటశేఖర కృష్ణ మరణంతో ఒక తరం కథనాయకులు కనుమరుగైనట్టే. తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులది ప్రత్యేక స్థానం. కానీ ఒక్కొక్కరూ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 1996లో ఎన్టీరామారావు చనిపోయారు. 1998లో శోభన్ బాబు, 2014లో ఏఎన్ ఆర్, 2022లో కృష్ణంరాజు, తాజాగా కృష్ణ దివికేగారు.

ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ తెలుగు సినిమా అగ్రనటులుగా కొనసాగారు. అటు కృష్ణ, శోభన్ బాబులు వారిని అనుసరించారు. మల్టీస్టార్ సినిమాలకు వీరిద్దరు పెట్టింది పేరు. అత్యధిక చిత్రాల్లో కలిసి నటించారు. తెలుగు సినిమారంలో కృష్ణార్జునులుగా పిలవబడే వారు. కృష్ణంరాజు తన డిఫరెంట్ మేనరిజమ్ తో రెబల్ స్టార్ గా ముద్రపడ్డారు. ఈ ఐదుగురు మంచి స్నేహితులు. వీరి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. ఒకరి మరణం తరువాత ఒకరు చిత్ర పరిశ్రమకు పెద్దగా నిలిచేవారు. 50 ఏళ్ల సినిమా చరిత్రలో ఒడి దుడుకులను, పరిణామాలకు సజీవ సాక్షంగా నిలిచేవారు. కానీ కృష్ణ మరణంతో సినిమా చరిత్రను మననం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి వరకూ ఈ తరానికి ప్రతినిధి కృష్ణ ఉండేవారు. కానీ ఆయన కూడా కాల ధర్మం చేశారు. రెండు నెలల కిందట తన సహచరుడు, తోటి నటుడు కృష్ణంరాజు మరణించినప్పుడు తన వయోభారాన్ని లెక్క చేయకుండా స్వయంగా వెళ్లి నివాళులర్పించారు. తన స్నేహాన్ని చాటుకున్నారు. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎనిమిది పదుల వయసులో ఎన్నో పరిణామాలను గుర్తుచేసుకొని మాట్లాడారు. తాను ఒక సీనియర్ నటుడిగానే కాకుండా ఈ తరానికి ప్రతినిధిగా మాట్లాడిన తీరును గుర్తుచేసుకొని అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇప్పటివరకూ చిత్ర పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా కృష్ణకు చెప్పుకునేవారు. ఒక తరానికి చివరి ప్రతినిధిగా ఉంటూ పరిస్థితులను చక్కదిద్దేవారు. సుదీర్ఘ చిత్ర పరిశ్రమ గమనంలో ఎదురైన కష్ట, నష్టాలు, వివాదాలు స్వయంగా చూసిన కృష్ణ వాటి గుణపాఠాలతో విలువైన సలహాలు, సూచనలిచ్చేవారు. పరిష్కారమార్గం చూపేవారు. ఇప్పుడు ఆ పరిష్కార వారధి అకాల మరణాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది,