YSR Congress: జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) స్పష్టమైన మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం ఆయనలో మార్పు తెచ్చింది. ఓటమి బాధ నుంచి వేగంగా కోలుకున్నారు. వరుసగా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉగాది నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల అక్రమ అరెస్టులు, కేసులపై గట్టిగానే స్పందిస్తున్నారు. అయితే గతంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా జరిగిన తప్పులను, తప్పిదాలను సరి చేసుకుని ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమై.. రోజులో వారికి కొంత సమయం కేటాయించాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
* అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన తీరు
జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)జనం నుంచి వచ్చిన నాయకుడు. అత్యంత జనాదరణతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జనాల ఆకాంక్షలను అంచనా వేయలేకపోయారు. అధికారంలో ఉన్న సమయంలో వారికి అందకుండా దూరంగా ఉన్నారు. కనీసం వారిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. నిత్యం ఆకాశమార్గంలో ప్రయాణించి.. ప్రజలను చేజేతులా దూరం చేసుకున్నారు. ఆ తప్పిదాలను ఇప్పుడు అధికారం దూరమయ్యేసరికి గుర్తించారు. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
* మహానేత మాదిరిగా
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) ప్రతిరోజు ప్రజలను కలిసిన తరువాతే నాయకులను కలిసేవారు. వారికి గాను ఉదయం పూట ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించేవారు. ప్రజలు కూడా రాజశేఖర్ రెడ్డి కి కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించేవారు. అందుకే నేరుగా ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించేవారు. ఆయన సైతం అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించేవారు. అందుకే రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి తన తండ్రి బాటను అనుసరించే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మహానేత మాదిరిగానే వ్యవహరించాలని ప్లాన్ చేస్తున్నారు.
* పార్టీ కార్యాలయం వద్ద పక్కాగా ఏర్పాట్లు
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో( Tadepalli YSR Congress office) ప్రజలు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా సాధారణ ప్రజల సైతం జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అలా తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బారికేడ్లు రూపొందిస్తున్నారు. నీడ కోసం సామ్యానాలు సైతం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు సిబ్బంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం పెరుగన్నం, సాంబార్ తో కూడిన ఆహారం అందించేందుకు సైతం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఓటమితో జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది.