
125 Feet Ambedkar Statue: ” ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అణగారి మగ్గుతున్న జాతి ఏదైనా ఉందంటే అది దళితులు మాత్రమే”నిన్న హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలవి. నిజమే దళితులు నేటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రాజ్యాంగం రాసింది తమ దళితుడు అయినప్పటికీ, హక్కులకు నోచుకోలేక వారు నరకం చూస్తూనే ఉన్నారు. సర్ కేసీఆర్ అనే వాడు రాజకీయ నాయకుడు కాబట్టి ఆరోపణలు చేస్తూనే ఉంటాడు. అందులో తప్పులేదు కూడా. కానీ ఎదుటివారి తప్పులను పెంచేటప్పుడు మన నలుపును కూడా చూసుకోవాలి కదా? కానీ దానిని కేసీఆర్ విస్మరిస్తున్నాడు. ఆ తప్పులను బయటకు రాకుండా తెలివిగా కవర్ చేస్తున్నాడు. అరచేతితో సూర్యుడికి అడ్డుపెట్టినంతమాత్రాన వెలుగు ఆగుతుందా?
దళిత ముఖ్యమంత్రి ఎక్కడ?
తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తే ఉంటాయి. బహుశా కెసిఆర్ కు గుర్తులేకపోయినప్పటికీ సోషల్ మీడియా గుర్తు చేస్తూనే ఉంటుంది. “తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయ్యేది దళితుడే” ఇవి ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయింది కేసీఆర్. మోసపోయింది దళితులు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమించాడు. కానీ కొన్నాళ్లకే ఏదో ఒక అభియోగం మోపి అతడిని బర్తరఫ్ చేశాడు. మరి అవే అభియోగాలు ఎమ్మెల్సీ కవిత మీద రోజూ వస్తున్నాయి. కానీ జరుగుతున్నది వేరు.
మూడెకరాలు ఉత్తి మాటేనా?
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అప్పట్లో కెసిఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. కొంతమందికి హడావుడిగా రాళ్లు రప్పలతో కూడిన భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు. దళితులను మొత్తం ఉద్ధరించినట్టు కలరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు నిండు శాసనసభలో దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పలేదు. మూడు ఎకరాల భూమి ఉంటే బాగుంటుందని పచ్చి అబద్ధం చెప్పారు.

దళిత బంధు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న తీరు
హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించాలనే సంకల్పంతో దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఒక్కో దళితుడికి 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్లో కూడా భారీగా నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. కానీ ఇవాల్టికి ఈ పథకం అమలవుతున్నది అంతంత మాత్రమే. పైగా పథకం బాధ్యత మొదట్లో కలెక్టర్లకు, తర్వాత స్థానిక ఎమ్మెల్యేలకు, ఇప్పుడు మళ్ళీ కలెక్టర్లకు అప్పగించారు. ఇందులో ఒక మెలిక ఉంది. నిధులు లేనప్పుడు పథకం అమలు బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. అరకొర నిధులు మంజూరు చేసినప్పుడు పథకం బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పథకం ఎంత గొప్పదో.
దళితులపై దారుణమైన దాడులు
ఇక మాట మాటకి దళితుల ఉద్ధరణ అంటూ అంబేద్కర్ లెవెల్లో మాటలు చెప్పే కేసిఆర్.. వారిని హింసించడంలో మాత్రం తమ ప్రభుత్వానికి సాటి ఎవరూ లేరని నిరూపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇవాల్టికి దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేటీఆర్ సిరిసిల్ల వెళ్లినప్పుడల్లా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటయ్యా అంటే దళితులుగా పుట్టడమే. అంతేకాదు సూర్యాపేట జిల్లా అడ్డ గూడూరు పోలీస్ స్టేషన్లో చేయని దొంగతనానికి మరియమ్మ అనే దళిత మహిళలు పోలీసులు లాకప్ డెత్ చేశారు.. చివరికి ప్రతిపక్షాలు ధర్నా చేస్తే ప్రభుత్వం దిగివచ్చింది. ఆమె కుటుంబానికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుతుంది. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఈ తొమ్మిదేళ్లలో ఎంతోమంది దళితులు న్యాయం దక్కక, సొంత రాష్ట్రంలో కన్నీటిని దిగమింగుకుంటున్నారు.
ముఖ్యమైన మంత్రి నియోజక వర్గంలోనే కేజీ టు పీజీ
ఇక కెసిఆర్ ఆర్భాటంగా ప్రకటించిన మరో హామీ కేజీ టు పీజీ విద్య. నేటికీ దీనికి సంబంధించి అడుగు కూడా పడలేదు. కనీసం ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదు. తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో ఒక కేజీ టు పీజీ విద్యను అందించేందుకు భవనం కట్టి.. తెలంగాణ మొత్తం ఇదే అమలు చేస్తామని ఎన్నికల ముంగిట ఇప్పుడు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలు నేటికీ ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి అద్దె చెల్లించడం ప్రభుత్వానికి తలకు మించిన భారంలాగా మారుతున్నది. అద్దె భవనాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు అంతంత మాత్రమే. అద్దెకు కోట్లల్లో చెల్లిస్తూ విద్యార్థుల మీద ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుందని గొప్పలు పోవడం బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లింది.
యూనివర్సిటీలను గాలికి వదిలేశారు
ఇక తెలంగాణ యూనివర్సిటీలకు సంబంధించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎంతటి పాత్ర పోషించాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక దశలో ఉద్యమం పక్కదారి పడుతున్నప్పుడు దానిని భుజాలకు ఎత్తుకుంది యూనివర్సిటీ విద్యార్థులే. రబ్బర్ బుల్లెట్ గాయాలు, లాఠీల దెబ్బలు తిని వారంతా తెలంగాణ ఉద్యమానికి దన్నుగా నిలిచారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? యూనివర్సిటీల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించింది అత్తెసరు నిధులు. పైగా యూనివర్సిటీల్లో గవర్నర్ పాత్రను తగ్గించేందుకు సర్కారు ఏకంగా కొత్త చట్టాలకు రూపకల్పన చేసింది. ఇన్నాళ్ళు యూనివర్సిటీలో పోస్టుల భర్తీని చేపట్టని ప్రభుత్వం తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు లోపభుయిష్ఠంగా నోటిఫికేషన్లు ఇస్తున్నది. పైగా దీనికి అడ్డుపడుతున్నారు అంటూ గవర్నర్ పై నిందలు వేస్తున్నది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలు
తెలంగాణ ఉద్యమం పుట్టిందే నిధులు, నీళ్ళు, నియామకాల కోసం.. ఇందులో పై రెండు ఎవరికీ దక్కలేదు. నియామకాల విషయంలోనూ ప్రభుత్వం అదే ధోరణి ప్రదర్శించింది.. అందుకు తాజా ఉదాహరణ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్. ఈ ఉదంతం వల్ల 30 లక్షల మంది నిరుద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ప్రశ్న పత్రాలకు సంబంధించి సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో అవి అంగట్లో సరుకులాగా అయిపోయాయి. ఫలితంగా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. కానీ దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీని తెరపైకి తీసుకొచ్చింది.. కానీ కోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వైఫల్యాలు, మరెన్నో మరకలు.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలని చెప్పిన వారు.. నేడు అదే రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించి, అభినవ అంబేద్కర్ గా డప్పులు కొట్టించుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే.