CM KCR: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రత్యేకం. 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్య వహించిన ఎంపీలు ఈ సమావేశాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధులుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఈ బడ్జెట్ సెషన్స్‌ను వీలైనంతమేర తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. కేంద్రంలో అధికార బీజేపీని ఇరకాటంలో పెట్టడం, దేశంలోని ఇతర పార్టీల దృష్టిని తమవైపు మళ్లించుకోవడం, దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

దేశం దృష్టిని ఆకర్షించేలా
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు మొదలుపెట్టిన నాటి నుంచి ఆయన ఫోకస్ జాతీయంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్నదానిపైనే ఉంది. అందుకు ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. తాజాగా పార్లమెంటు సమావేశాలను ఇందుకు వేదిక చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. బీఆర్‌ఎస్‌పై ఇతర పార్టీల్లో సానుకూల దక్పథం పెంచేలా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్రంపై కేసీఆర్ పోరాటం..
జాతీయ రాజకీయాల కోసం ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్న గులాబీ బాస్ కేంద్రంలోని దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో తెలుగు వాళ్లకు బలం ఉన్నచోట వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆయన, తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సాక్షిగా కేంద్రంపై పోరాటం చేయడానికి తెలంగాణ ఎంపీలను సిద్ధం చేశారు.
– జాతీయ అంశాలపై ఫోకస్..
పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై కాకుండా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలపై పోరాటం చేయాలని ఎంపీలకు సూచించారు. సమావేశాల్లో ఏ అంశాలను లేవనెత్తాలి? ఏ అంశాలపై పోరాటం చేయాలి? ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలతోపాటుగా, గవర్నర్ల వ్యవహారం ప్రస్తావించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. అంతేకాదు కలిసి వచ్చే పార్టీలతో జాతీయ సమస్యలపై పార్లమెంటు వేదికగా పోరాటం చేయాలని ఎంపీలకు సూచించారు. ఈ క్రమంలో వివిధ పార్టీలు కేంద్రం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమస్యలు ఏంటి? ఆ సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలి అన్నదాని పైన కూడా తెలంగాణ ఎంపీలతో సుదీర్ఘంగా చర్చించారు.
కలిసి వచ్చే పార్టీల కోసం..
పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌తో కలిసొచ్చే పార్టీల కోసం కూడా కేసీఆర్ వ్యూహం రూపొందించారు. జాతీయ సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేయడం ద్వారా వివిధ పార్టీల దృష్టిని ఆకర్షించాలని ఎంపీలకు సూచించారు. అవరమైతే ఆయా పార్టీలు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. తద్వారా భవిష్యత్‌లో కసిలి పనిచేయాలన్న సంకేత్రం పంపాలని సూచించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ఆకర్షితులు అవుతున్న వారితో మంతనాలు జరుపుతున్న కేసీఆర్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కేంద్రంగానూ, బీఆర్‌ఎస్‌ను బలంగా చూపించి జాతీయ రాజకీయాల్లో తమకు మద్దతు ఇచ్చే నాయకులను గుర్తించే పనిలో పడ్డారు.

గవర్నర్ల వ్యవహారంపై ఆందోళన..
దేశంలోని రాజకీయ పార్టీల దృష్టి ఆకర్షించే యత్నంలో భాగంగా గవర్నర్ల వ్యవస్థపైనా పార్లమెంట్‌లో ఆందోళన చేయాలని కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎంపీలకు సూచించారు. తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు ప్రభుత్వాలతో వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని తెలిపారు. తద్వారా దేశంలోని రాజకీయ పార్టీల అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
నిరసనతోనే మొదలు..
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో తమ వైఖరి ఎలా ఉండబోతుందో కేంద్రానికి తెలుపాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన ప్రతీ వ్యూహాన్ని ఆయన ఇప్పటికే ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. మరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలతో కేంద్రంలో అధికార బీజేపీని ఇరకాటంలో పెడతారా లేక తానే ఇరకాటంలో పడతారా అనేది వేచిచూడాలి.