
KCR- Jagan: పిల్లిని ఇంట్లో బంధించి కొడితే పులిగా మారుతుందంటారు. అంత చిన్న జీవి తన ఆత్మరక్షణకు తిరగబడుతుంది. ఎదురుదాడికి దిగుతుంది. ఇప్పుడు పిల్లికి ఎదురైన సంకటమే ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడింది. ఎదుర్కోవాల్సిన స్థానంలో ఉన్న సీఎం జగన్ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. . తాను కేవలం అడగగలను మాత్రమే కానీ.. పోరాడలేనని చేతులెత్తేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కళ్లెదుటే ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలను కనీస స్థాయిలో అడ్డుకోలేదు. పొరుగున ఉన్న తెలంగాణ సర్కారు మాత్రం శరవేగంగా స్పందించింది. ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని తప్పుపట్టడమే కాకుండా… ప్లాంట్ నిర్వహణ కోసం అవసరమైతే ముడిసరుకు, మూలధనం పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం.
విపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా..
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ గట్టిగానే మాట్లాడేవారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పుపట్టేవారు. తనకు అధికారం అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తానని చెప్పేవారు. తీరా అధికారంలోకి రాగానే మెడలు వంచడం కాదు.. తానే మెడ దించుకొని ఉంటున్నారు. పవర్ లోకి వచ్చిన తొలినాళ్లలో ఢిల్లీ వెళ్లి కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ మన దురదృష్టం కొద్దీ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీ సాధించిందని.. ఏ విషయంలో డిమాండ్ చేయలేమని.. వేడుకోలు తప్పమనకు తోవ లేదన్నట్టు ప్రకటించారు. ఇప్పటికీ అవే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ ఎక్కడా పోరాటం చేయలేకపోతున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అలానే వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ సర్కారు వ్యూహాత్మకంగా..
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ విషయంలో కేసీఆర్ సర్కారు జగన్ కు విషమ పరీక్ష పెట్టింది. ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్ర ప్రభుత్వానికి జగన్ గట్టిగా చెప్పలేకపోతున్నారు. కనీసం లేఖ రాయడానికి కూడా భయపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ దాఖలు చేసేందుకు కేసీఆర్ సర్కారు ముందుకొచ్చింది. దీంతో అందరిచూపు ఏపీపై పడింది. ఇప్పుడు కూడా స్పందించకుంటే ప్రజల్లో పరువుపోతుందని గ్రహించి సలహాదారుడు సజ్జల వారు ప్రెస్ మీట్ పెట్టారు. కేంద్రానికి ఎదురించలేమని.. కేవలం విన్నవించగలమని చెప్పి ముగించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి జగన్ భయపడుతున్నట్టు తేటతెల్లమవుతోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వైసీపీ వాదన తప్పు..
అయితే కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉంది కాబట్టే తామ అవసరం లేదని వైసీపీ చెబుతోంది. లోక్ సభలో మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో మాత్రం బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేదు. కీలక బిల్లుల విషయంలో వైసీపీపై ఆధారపడింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ఆ సంఖ్యాబలంను వినియోగించుకోవడం లేదు. అందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడుగు ముందుకు పడడం లేదు. అయినా సరే వైసీపీ నోరు మెదపడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం. అందుకే కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించే ఏ పనికీ జగన్ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అప్పులు తెచ్చుకొని పథకాలు నడిపిస్తున్నారు. అంతకంటే మెరుగైన పాలన ఏముంటుందని చెబుతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రయోజనాలు గాల్లో కలిపివేస్తున్నారన్న మాట.